రైవాడకు పొంచి ఉన్న ముప్పు
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:17 AM
బడా పారిశ్రామికవేత్త అదాని అడిగిన ప్రతి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పువ్వుల్లో పెట్టి అప్పగిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిని బలపరిచేలా దేవరాపల్లి మండలం బలిపురం వద్ద పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టు(హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు)ను కట్టబెట్టడానికి నిర్ణయించారని ప్రచారం సాగుతోంది.
బలిపురం వద్ద హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టుకు సన్నాహాలు
అదానీకి అప్పగించడానికి ప్రయత్నాలు
- సర్వే చేస్తున్న కోల్‌కత్తాకు చెందిన సంస్థ
- ఆయకట్టు రైతుల్లో గుబులు
- ఆందోళనకు సిద్ధమవుతున్న విపక్షాలు
అనకాపల్లి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): బడా పారిశ్రామికవేత్త అదానీ అడిగిన ప్రతి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పువ్వుల్లో పెట్టి అప్పగిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిని బలపరిచేలా దేవరాపల్లి మండలం బలిపురం వద్ద పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టు(హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు)ను కట్టబెట్టడానికి నిర్ణయించారని ప్రచారం సాగుతోంది. పవర్ ప్రాజెక్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి కోల్‌కత్తాకు చెందిన ఒక సంస్థ కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో సర్వే చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే రైవాడ ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా చింతపల్లి మండలం ఎర్రవరంలో పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టు(హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్)ను షిర్డీసాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్(ప్రభుత్వంలో కీలక పెద్దలకు దగ్గర బంధువు అని చెబుతారు), అనంతగిరి మండలం పెదకోట వద్ద అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులతో తాండవ, రైవాడ రిజర్వాయర్‌లకు ముప్పు ఏర్పడుతుందని జలవనరుల శాఖ ఇప్పటికే నివేదిక అందజేసింది. రెండు చోట్ల పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుపై రెండు ప్రాజెక్టుల కింద ఆయకట్టు రైతులు, గిరిజనులు అభ్యంతరం చెబుతున్నారు. కాగా పెదకోటదరి ప్రాజెక్టు కాకుండా అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ బలిపురం వద్ద శారదానది నుంచి రైవాడ జలాశయానికి నీరు వచ్చే ప్రాంతంలో పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టు(హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్) ఏర్పాటుకు అదాని గ్రూప్ పలు రకాల సర్వేలు చేపట్టిందనే ప్రచారం జరుగుతోంది. ప్రాజెక్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టే బాధ్యతను కోత్‌కత్తాకు చెందిన ఒక సంస్థకు అప్పగించింది. దీనిలో భాగంగా కోల్‌కత్తాకు చెందిన సంస్థ ఇక్కడ మట్టి నమూనాలు సేకరించేలా యంత్రాలు ఉపయోగించి పనులు చేస్తోంది. బలిపురం నుంచి విజయనగరం జిల్లా వేపాడ ఈలుపర్తి పంచాయతీలోని మారికవలస కొండ మధ్య 60 అడుగుల లోతులో సుమారు 25 నుంచి 30 చోట్ల మట్టి నమూనాలు సేకరించాలని ఈ సంస్థ నిర్ణయించగా, ప్రస్తుతం బలిపురం వద్ద నమూనా సేకరణ పనులు సాగుతున్నాయి. నీటి వనరుల లభ్యత, నిర్మాణానికి సంబంధించి నాణ్యత, నీటి నిల్వ ప్రదేశాలు, ఇతర అంశాలపై సర్వే జరుగుతోంది. బలిపురం, మారికవలస కొండ మధ్య నుంచి శారదానది ప్రవహిస్తోంది. రెండు గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. శారదా నది నీరే రైవాడ రిజర్వాయరుకు ప్రధాన నీటి వనరుగా ఉంది. శారదానదిపై పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మిస్తే రైవాడ ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవరాపల్లి దరి శారదానదిపై నిర్మించిన రైవాడ ప్రాజెక్టు కెపాసిటీ 2.36 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు కింద 15,344 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇంకా ప్రతి రోజు 50 క్యూసెక్కుల నీరు విశాఖ నగరానికి సరఫరా చేస్తున్నారు. ఒకవేళ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుకూలంగా సర్వే నివేదికలు వస్తే రైవాడ ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలు పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుపై ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంత నియోజకవర్గం మాడుగుల పరిధిలో రైవాడ ప్రాజెక్టుతోపాటు ఆయకట్టు ప్రాంతం మొత్తం ఉంది. అదానికి ఈ ప్రాజెక్టు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై ఆందోళన చేపట్టేలా ఇప్పటికే తెలుగుదేశం, వామపక్షాలు కార్యాచరణకు నడుం బిగించాయి.