Share News

పర్యాటకుల కోలాహలం

ABN , First Publish Date - 2023-12-11T01:16:07+05:30 IST

మన్యంలోని పర్యాటక ప్రాంతాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. ప్రస్తుతం కార్తీక మాసం, పిక్నిక్‌ల సీజన్‌ను కావడంతో పాటు శని, ఆదివారాలు వరుస సెలవులు రావడంతో జనం మన్యం బాటపట్టారు. దీంతో ఆదివారం ఎక్కడ చూసినా పర్యాటకుల రద్దీ కనిపించింది.

పర్యాటకుల కోలాహలం
వంజంగి హిల్స్‌లో సూర్యోదయాన్ని తిలకిస్తున్న సందర్శకులు

- బొర్రాగుహలు నుంచి లంబసింగి వరకు రద్దీ

- వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో సందర్శనీయ ప్రాంతాలు కిటకిట

(ఆంధ్రజ్యోతి/పాడేరు, న్యూస్‌ నెట్‌వర్క్‌)

మన్యంలోని పర్యాటక ప్రాంతాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. ప్రస్తుతం కార్తీక మాసం, పిక్నిక్‌ల సీజన్‌ను కావడంతో పాటు శని, ఆదివారాలు వరుస సెలవులు రావడంతో జనం మన్యం బాటపట్టారు. దీంతో ఆదివారం ఎక్కడ చూసినా పర్యాటకుల రద్దీ కనిపించింది.

ఏజెన్సీలో అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు ఒకటే హడావిడి నెలకొంది. ప్రస్తుతం కార్తీక మాసం ఆఖరు కావడంతో పర్యాటక ప్రదేశాల సందర్శనకు జనం ఆసక్తి చూపుతున్నారు. దీంతో అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌, చెరువువేనం మేఘాలకొండ, లంబసింగి, యర్రవరం జలపాతం ప్రాంతాలకు అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.

వంజంగి హిల్స్‌ వద్ద..

మండలంలో ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌కు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. వాతావరణంలోని మార్పుల కారణంగా గత వారం వంజంగి హిల్స్‌లో మంచు మంచు మేఘాలు కానరాని దుస్థితి నెలకొంది. దీంతో సందర్శకులు తీవ్ర నిరాశఽకు గురయ్యారు. కాగా శని, ఆదివారాలు సెలవులు కావడంతో ఆదివారం తెల్లవారు జామున అధిక సంఖ్యలో పర్యాటకులు వంజంగి హిల్స్‌ను సందర్శించారు. వాతావరణం అనుకూలించి చూడచక్కని సూర్యోదయం, మంచు మేఘాలు ఆలరించాయి. దీంతో సందర్శకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

అరకులోయలో..

అరకులోయ: నియోజకవర్గంలోని ప్రముఖ సందర్శనీయ ప్రాంతాలు పర్యాటకులతో ఆదివారం కిటకిటలాడాయి. అరకులోయ, అనంతగిరి, డుంబ్రి గుడ మండలాల పరిధిలోని పర్యాటక ప్రాంతాలు రద్దీగా కనిపించాయి. బొర్రాగుహలు, కటికి జలపాతం, అనంతగిరి సమీపంలో తాడిగుడ జలపాతం, అనంతగిరి, అరకులోయ ఘాట్‌లో ఉన్న కాఫీ తోటలు, గాలికొండ వ్యూపాయింట్‌, గన్నెల జంక్షన్‌ ఘాటింగ్‌ స్పాట్‌, అరకులోయ పట్టణంలో మ్యూజి యం, పద్మాపురం గార్డెన్‌, రణజిల్లడ జలపాతం, డుంబ్రిగుడ చాపరాయి గెడ్డ వద్ద పర్యాటకులు సందడి చేశారు. కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో వన భోజనాలకు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. మాడగడ మేఘాల కొండ వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే పర్యాటకుల తాకిడి కనిపించింది.

మాడగడ మంచు అందాలు

అరకులోయకు సమీపంలోని మాడగడ మేఘాల కొండ వద్ద తెల్లవారు జాము నుంచే పర్యాటకుల సందడి కనిపించింది. ఓ వైపు దట్టంగా మంచు కురుస్తుంటే గిరిజన కళాకారుల బృందం క్యాంప్‌ ఫైర్‌ ఏర్పాటు చేసి థింసా నృత్యం చేశారు. ఆసక్తి చూపిన పర్యాటకులకు గిరిజన మహిళల వేషధారణ లో అలంకరిస్తున్నారు. ఆ వేషధారణలో వారు థింసా నృత్యం చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక మాడగడ వద్ద సూర్యోదయం కోసం పర్యాటకులు పడిగాపు లు కాశారు. మంచును చీల్చుకుంటూ వచ్చే సూర్యకిరణాల కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ సమయంలో సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొట్టారు. కాగా అరకులోయ నుంచి సుంకరమెట్ట వరకు ఉన్న సహజసిద్ధ ప్రకృతి అందాలను తిలకించి ఆనందాన్ని పంచుకున్నారు.

లంబసింగి వద్ద..

చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగి ఆదివారం పర్యాటకులతో రద్దీగా కనిపించింది. ప్రస్తుతం కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చెరువులవేనం, లంబసింగిలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ప్రకృతి ప్రేమికులు లంబసింగికి క్యూ కడుతున్నారు. ఆదివారం లంబసింగి, తాజంగి, చెరువులవేనం ప్రాంతాలకు వేల సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్ద మంచు సోయగాలను వీక్షించేందుకు ఉదయం ఐదు గంటల నుంచే పర్యాటకుల నిరీక్షణ ప్రారంభమైంది. దీంతో చెరువులవేనంలో జాతర వాతావరణాన్ని తలపించింది. పర్యాటకులు మంచు అందాలను కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడ్డారు. పచ్చని అడవులను తాకుతూ పయనించే మంచు మేఘాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేశారు. అలాగే యర్రవరం జలపాతాన్ని కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. సాయంత్రం వరకు పర్యాటక ప్రాంతాలు, స్ట్రాబెర్రీ తోటలు సందర్శకులతో రద్దీగా కనిపించాయి.

Updated Date - 2023-12-11T01:16:08+05:30 IST