పర్యాటకుల కోలాహలం
ABN , First Publish Date - 2023-11-26T22:56:13+05:30 IST
మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం సందడి నెలకొంది. ప్రస్తుతం కార్తీక మాసం పిక్నిక్‌ల సీజన్ కావడంతో జనం మన్యం బాటపట్టారు. దీంతో ఏజెన్సీలో ఎక్కడ చూసినా పర్యాటకులే కనిపించారు.
మన్యానికి పోటెత్తిన సందర్శకులు
కార్తీక మాసం కావడంతో పిక్నిక్‌ల సందడి
రద్దీగా పర్యాటక ప్రాంతాలు
(ఆంధ్రజ్యోతి/పాడేరు, న్యూస్ నెట్‌వర్క్)
మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం సందడి నెలకొంది. ప్రస్తుతం కార్తీక మాసం పిక్నిక్‌ల సీజన్ కావడంతో జనం మన్యం బాటపట్టారు. దీంతో ఏజెన్సీలో ఎక్కడ చూసినా పర్యాటకులే కనిపించారు.
అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు ఒకటే సందడి నెలకొంది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో పర్యాటక ప్రదేశాల సందర్శనకు జనం ఆసక్తి చూపుతున్నారు. దీంతో అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం ప్రాంతాలను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు.
లంబసింగి కిటకిట
చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు. కార్తీక మాసం, వీకెండ్ కలిసి రావడంతో ఆదివారం భారీగా పర్యాటకులు తరలి వచ్చారు. కొంత మంది పర్యాటకులు ముందు రోజే లంబసింగికి చేరుకోగా, అత్యధిక సంఖ్యలో పర్యాటకులు ఉదయం చేరుకున్నారు. దీంతో ఉదయం ఐదు గంటల నుంచే లంబసింగి, చెరువులవేనం, తాజంగి జలాశయంలో సందడి నెలకొంది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద రద్దీ కనిపించింది. మంచు అందాలను ఆస్వాదించేందుకు అత్యధిక సంఖ్యలో పర్యాటకుల రావడంతో వ్యూపాయింట్ సందర్శకులతో కిటకిటలాడింది. పర్యాటకులు మంచు సోయగాలను తిలకిస్తూ ఫొటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. సాయంత్రం వరకు లంబసింగి పరిసర ప్రాంతాలు పర్యాటకులతో రద్దీగా కనిపించాయి.
వంజంగి మేఘాలకొండ వద్ద..
పాడేరురూరల్: జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన మండలంలోని వంజంగి మేఘాల కొండకు ఆదివారం పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. పర్యాటకుల వాహనాలతో ప్రధాన రహదారి కిక్కిరిసింది. అక్కడ నుంచి కొండపైకి పర్యాటకులు చేరుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించారు. పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలు, సూర్యోదయ సమయంలో భానుడి కిరణాలకు పర్యాటకులు మంత్రముగ్ధులయ్యారు. అనంతరం అక్కడ నుంచి పర్యాటకులు జిల్లాలోని జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి భారీగా తరలివెళ్లారు.
అరకులోయలో..
అరకులోయ: పర్యాటకులతో అరకులోయ సందడిగా కనిపించింది. దూర ప్రాంతాల నుంచి చాలా మంది పర్యాటకులు శనివారం రాత్రే ఇక్కడికి చేరుకున్నారు. కొందరు ఆదివారం ఉదయం వచ్చారు. పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, ఘాట్‌రోడ్డులో అనంతగిరి, బీసుపురం, సుంకరమెట్ట కాఫీ తోటలు, గాలికొండ వ్యూపాయింట్ వద్ద సందడి చేశారు.
సందడిగా చాపరాయి
డుంబ్రిగుడ: మండలంలోని పర్యాటక కేంద్రాలు పర్యాటకులతో కిటకిటలాడాయి. మండల కేంద్రంలోని చాపరాయి జలవిహారికి పర్యాటకులు పోటెత్తారు. జలవిహారిలో స్నానాలు చేసి సందడిగా గడిపారు. జలపాతంలో గిరిజన మహిళలు ప్రదర్శించిన థింసా నృత్యాలను ఆస్వాదించారు. జైపూర్ జంక్షన్ నుంచి చాపరాయి జలపాతంలోని జాతీయ రహదారికి ఇరువైపులా బంతిపూలు, పొద్దు తిరుగుడు పూల తోటల్లో పర్యాటకులు ఫొటోలు తీసుకున్నారు. అంజోడ సిల్క్‌ఫాం, కొల్లాపుట్టు జలతరంగిణిని అధిక సంఖ్యలో సందర్శించారు. కార్తీక మాసం కావడంతో రెండు వారాలుగా పర్యాటక కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి.