కొందరికే ‘ఫ్యామిలీ డాక్టర్‌’

ABN , First Publish Date - 2023-05-31T22:42:48+05:30 IST

‘కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందనే’ చందంగా ఉంది.. మన్యంలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం. పల్లెల్లోని ప్రతి రోగికి వైద్యుడితో సేవలందించాలనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానం మన్యంలో ఆశించిన ఫలితాలివ్వడం లేదని తెలుస్తున్నది.

కొందరికే ‘ఫ్యామిలీ డాక్టర్‌’
ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో భాగంగా వైద్య సేవలు అందిస్తున్న దృశ్యం

మారుమూల ప్రాంత వాసులకు అందని వైద్య సేవలు

సచివాలయాలకే పరిమితం

‘మిడ్‌ లైఫ్‌ హెల్త్‌ ప్రొవైడర్ల’ సేవల వినియోగం శూన్యం

మందులు ఇవ్వలేని పరిస్థితిలో ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్‌లు

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

‘కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందనే’ చందంగా ఉంది.. మన్యంలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం. పల్లెల్లోని ప్రతి రోగికి వైద్యుడితో సేవలందించాలనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానం మన్యంలో ఆశించిన ఫలితాలివ్వడం లేదని తెలుస్తున్నది. ఈ విధానంతో వైద్యుల సేవలు కేవలం సచివాలయం పరిధిలోని వారికే అందుతుండగా, మారుమూల వాసులకు వైద్య సేవలు అందని పరిస్థితి కొనసాగుతున్నది. దీంతో ఫ్యామిలీ డాక్టర్‌ విధానంతో గిరిజనులు వైద్యానికి మరింత దూరమవుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

ఏజెన్సీ వ్యాప్తంగా 244 గ్రామ పంచాయతీల పరిధిలోని 212 గ్రామ సచివాలయాలున్నాయి. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో భాగంగా ప్రతి గ్రామ సచివాలయాన్ని రెండు పాయింట్లుగా విభజించి, ఆయా పాయింట్‌లో ప్రతి 15 రోజులకు ఒకసారి వైద్యుడు, సిబ్బందితో రోగులకు వైద్య సేవలు అందించి, అవసరమైన మందులను పంపిణీ చేస్తున్నారు. అందుకు గానూ ప్రతి మండలానికి రెండు చొప్పున ప్రత్యేక వాహనాలను సమకూర్చడంతోపాటు, ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు, దాని పరిధిలోని పారామెడికల్‌ సిబ్బంది, ఆశ కార్యకర్తలతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.

మారుమూల వాసులకు అందని వైద్య సేవలు

ఫ్యామిలీ డాక్టర్‌ విధానంతో కేవలం గ్రామ సచివాలయం ఉన్న గ్రామం, దానికి ఆనుకుని ఉన్న కొన్ని గ్రామాలకు చెందిన రోగులకు మాత్రమే వైద్య సేవలు అందుతుండగా, మారుమూల ప్రాంతాల్లోని రోగులకు ఈ వైద్య సేవలు అందడం లేదు. ఏజెన్సీలోని గ్రామాలు సచివాలయానికి 5 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో మారుమూల ప్రాంతాల్లోని రోగులు ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య శిబిరానికి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఉదాహరణకు పాడేరు మండలం గొండెలి గ్రామ సచివాలయం పరిధిలో కించూరు, గొండెలి పంచాయతీలకు చెందిన 25 గ్రామాలున్నాయి. వాటిలో సగానికిపైగా గ్రామాలు మారుమూల కొండ ప్రాంతంలో ఉన్నాయి. దీంతో గొండెలి సచివాలయం పరిధిలో అందించే ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య శిబిరానికి ఆయా మారుమూలనున్న గ్రామాల్లోని రోగులు రాలేని పరిస్థితి. ఇదిలా ఉండగా ఇన్నాళ్లూ గ్రామాలను సందర్శించి వాళ్లు గుర్తించిన రోగులకు మందులు ఇచ్చే ఏఎన్‌ఎం, హెల్త్‌ అసిస్టెంట్‌లకు ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వైద్యుడు లేకుండా మందులు ఇవ్వకూడదనే నిబంధన పెట్టారు. దీంతో ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్‌లు గ్రామాలను సందర్శించినా, రోగులకు మందులు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో వాళ్లు గుర్తించిన రోగులను సచివాలయానికి చేరువలో ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య శిబిరానికి వెళ్లాలని సలహా ఇవ్వడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి కొనసాగుతున్నది. వాస్తవానికి గతంలో వలే ఏజెన్సీలో ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్‌ ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందించే అవకాశం కల్పించాలని మారుమూల వాసులు కోరుతున్నారు.

‘మిడ్‌ లైఫ్‌ హెల్త్‌ ప్రొవైడర్ల’ సేవల వినియోగమేది..?

ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమల్లో భాగంగా ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్య సేవలు అందించేందుకు గానూ ‘మిడ్‌ లైఫ్‌ హెల్త్‌ ప్రొవైడర్ల’ను ప్రభుత్వం నియమించింది. కానీ ఫ్యామిలీ డాక్టర్‌ విధానంతో వ్యవహారమంతా సచివాలయాల పరిధిలో జరుగుతుండడంతో ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఉంటున్న వారంతా సరైన పనిలేక ఖాళీగా ఉంటున్నారు. వాస్తవానికి సచివాలయానికి దూరంగా ఉన్న గ్రామాలకు ‘మిడ్‌ లైఫ్‌ హెల్త్‌ ప్రొవైడర్ల’ను పంపించి ఆయా ప్రాంతాల్లోని రోగులకు వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడితే బాగుండేది. కానీ వైద్యులు లేకుండా మందులు ఇవ్వకూడదనే నిబంధనతో పాటు వారిని ఆరోగ్య ఉప కేంద్రాలకే పరిమితం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్వీర్యం చేసి గ్రామ సచివాలయం పరిధిలోనే వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశ పెట్టిన ప్రభుత్వం, ఆరోగ్య ఉప కేంద్రాల్లో ‘మిడ్‌ లైఫ్‌ హెల్త్‌ ప్రొవైడర్ల’ను నియమించడంతో ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పునరాలోచించి మన్యంలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలోని లోపాలను సవరించి, మారుమూల గిరిజనులకు సైతం వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

’ఫ్యామిలీ డాక్టర్‌’ విధానంలో చేయాల్సిన మార్పులివి

- మారుమూల రోగులను అంబులెన్సుల్లో సచివాలయంలో నిర్వహించే ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య శిబిరానికి తరలించాలి.

- సచివాలయం పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహించే పాయింట్లను పెంచాలి.

- గతంలో వలే ఏఎన్‌ఎం, హెల్త్‌ అసిస్టెంట్‌ల సేవలను గ్రామాల్లో కొనసాగించాలి.

- ‘మిడ్‌ లైఫ్‌ హెల్త్‌ ప్రొవైడర్ల’ సేవలను మారుమూల గ్రామాల్లో అందించేలా చూడాలి.

Updated Date - 2023-05-31T22:42:48+05:30 IST