మహిళల నివాసానికి యోగ్యమైన నగరం

ABN , First Publish Date - 2023-01-29T00:51:22+05:30 IST

మహిళల నివాసయోగ్యమైన నగరాల్లో దేశంలో విశాఖపట్నం ఏడో స్థానంలో నిలిచింది.

మహిళల నివాసానికి యోగ్యమైన నగరం

దేశంలో మిలియన్‌ ప్లస్‌ కేటగిరీ విభాగంలో విశాఖకు ఏడో స్థానం

ఏపీలో మరే నగరానికి దక్కనిచోటు

ఐదు అంశాలు ప్రాతిపదికగా అవతార్‌ గ్రూప్‌ సర్వే

మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలే కారణం: నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహిళల నివాసయోగ్యమైన నగరాల్లో దేశంలో విశాఖపట్నం ఏడో స్థానంలో నిలిచింది. ప్రతిష్టాత్మకమైన అవతార్‌ గ్రూపునకు చెందిన డైవర్సిటీ, ఈక్వాలిటీ మరియు ఇనుక్లూజన్‌ (డీఈఐ) అనే సంస్థ దేశవ్యాప్తంగా 111 నగరాల్లో మహిళలకు సంబంధించిన ఐదు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని నిర్వహించిన సర్వే ఫలితాలను ఇటీవల వెల్లడిచింది. పది లక్షలు పైబడిన జనాభా కలిగిన నగరాల కేటగిరిలో చెన్నై మొదటి స్థానంలో నిలవగా విశాఖ ఏడో స్థానంలో నిలిచింది.

దేశంలో మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లు, మహిళా సాధికారత ఏ స్థాయిలో వుందో తెలుసుకునేందుకు ‘అవతార్‌’ గ్రూపునకు చెందిన డైవర్సిటీ, ఈక్వాలిటీ, ఇనుక్లూజన్‌ (డీఈఐ) అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. సర్వేలో జనాభా పది లక్షలలోపు, పది లక్షలకంటే పైబడిన (మిలియన్‌ ప్లస్‌) నగరాలు కింద రెండు కేటగిరీలుగా విభజించింది. మొత్తం 111 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఆయా నగరాల్లో నివసిస్తున్న మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న అనుభవాలు, భద్రత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రైవేటు సంస్థల్లో మహిళల పాత్ర, చట్టసభల్లో ప్రాతినిధ్యం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సాధించిన సాధికారత వంటి అంశాలపై కొంతమంది మహిళల అభిప్రాయాలను సేకరించింది. వీటితోపాటు ఆయా నగరాల్లో మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్‌, గృహ హింస వంటి కేసులకు సంబంధించిన క్రైమ్‌ రికార్డులు, జాతీయ స్థాయి గణాంకాలను పరిశీలనలోకి తీసుకుంది. దీనిప్రకారం మిలియన్‌ ప్లస్‌ నగరాల్లో మహిళల నివాసానికి అత్యంత యోగ్యమైన, ఉత్తమ నగరంగా చెన్నైకు మొదటి స్థానం దక్కగా, విశాఖపట్నం ఏడో స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో పూణె మూడో స్థానంలో బెంగళూరు, నాలుగో స్థానంలో హైదరాబాద్‌, ఐదో స్థానంలో ముంబై, ఆరో స్థానంలో అహ్మదాబాద్‌, ఎనిమిదో స్థానంలో కోల్‌కతా, తొమ్మిదో స్థానంలో కోయంబత్తూర్‌, పదో స్థానంలో మధురై నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీ 14 స్థానంలో నిలవడం విశేషం. మహిళలు నివాసానికి దేశంలోనే అత్యుత్తమ పది నగరాల్లో విశాఖ ఏడో స్థానంలో నిలవడంపై సీపీ సీహెచ్‌ శ్రీకాంత్‌ హర్షం వ్యక్తంచేశారు. నగర పోలీస్‌ శాఖ తరపున మహిళల భద్రత కోసం తాము తీసుకుంటున్న చర్యలే దేశంలో ఏడో స్థానం దక్కడానికి కారణమన్నారు. మహిళల భద్రత కోసం డయల్‌ 112తోపాటు విద్యా సంస్థలు, కార్యాలయాలు, పని ప్రదేశాలు, బస్టాప్‌లు, పర్యాటక ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఒక ఏసీపీ ఆధ్వర్యంలో 40 మంది సిబ్బందిని నియమించామని మహిళల సమస్యలపై తక్షణం స్పందించి నిందితులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే దిశ పెట్రోలింగ్‌ కోసం నాలుగు కార్లు, ఎనిమిది ద్విచక్ర వాహనాలపై సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారని వివరించారు.

Updated Date - 2023-01-29T00:51:23+05:30 IST