టీడీపీ నిరసనల హోరు

ABN , First Publish Date - 2023-09-26T00:47:10+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పార్టీ శ్రేణులు పలు రకాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 13వ రోజైన సోమవారం పలు మండలాల్లో నిరసన దీక్షలు, వినూత్న ప్రదర్శలు చేపట్టారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు కళ్లకు గంతలు కట్టుకొని, చేతులకు సంకెళ్లు వేసుకొని అనకాపల్లి రింగ్‌రోడ్డులో ప్రదర్శన చేశారు.

టీడీపీ నిరసనల హోరు
కళ్లకు గంతలు, చేతులకు సంకెళ్లతో అనకాపల్లిలో రోడ్డుపై బైఠాయించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, నాయకులు

జిల్లా అంతటా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

కళ్లకు గంతలు, చేతులకు సంకెళ్లతో జిల్లా అధ్యక్షుడు వినూత్న ప్రదర్శన

వడ్డాది వద్ద పెద్దేరు నదిలో టీడీపీ శ్రేణులు జలదీక్ష

చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఆలయల్లో ప్రత్యేక పూజలు

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌ నెట్‌వర్క్‌)

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పార్టీ శ్రేణులు పలు రకాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 13వ రోజైన సోమవారం పలు మండలాల్లో నిరసన దీక్షలు, వినూత్న ప్రదర్శలు చేపట్టారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు కళ్లకు గంతలు కట్టుకొని, చేతులకు సంకెళ్లు వేసుకొని అనకాపల్లి రింగ్‌రోడ్డులో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం హయాంలో ఏర్పాటు చేసిన స్కిల్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ శిక్షణ కేంద్రాలు కళ్లముందు కనిపిస్తున్నప్పటికీ మంత్రి బొత్స సత్యనారాయణ కళ్లు లేని కబోదిలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా వున్నప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స.. వోక్స్‌ వ్యాగన్‌ కంపెనీ ఏర్పాటు కోసం ఓ డొల్ల కంపెనీకి రూ.11.5 కోట్ల ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఇచ్చిన విషయాన్ని మరిచిపోయి ఇప్పుడు చంద్రబాబుపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని బుద్ద అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని కోరుతూ అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో కశింకోట మండలం పేరంటాలపాలెంలో మహిళలు శారదా నది నుంచి 500 బిందెలతో నీళ్లు తీసుకొనివచ్చి ఆలయంలో శివునికి అభిషేకం చేశారు. గొలుగొండ మండలం పాతమల్లంపేటలోని ఉమాధారమల్లేశ్వస్వామి ఆలయంలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజులు నిర్వహించారు. 109 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబునాయుడు ఆరోగ్యంగా వుండాలని ఆకాంక్షించారు. నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ ఆధ్వర్యంలో మహిళలు రామాలయానికి వెళ్లి గ్రామ దేవత అయిన బోయాలమ్మ అమ్మవారికి పుసుపునీళ్లతో ప్రత్యేకపూజలు నిర్వహించారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందంటూ నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి ఆధ్వర్యంలో బుచ్చెయ్యపేట మండలం వడ్డాది వద్ద పెద్దేరు నదిలో దిగి జలదీక్ష చేశారు. జనసేన కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోలుగుంటలో ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరంలో చోడవరం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం జగన్‌ కక్ష పూరిత రాజకీయాలకు నిదర్శనమని ఆయన అన్నారు.

మాడుగుల నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌, సీనియర్‌ నాయకుడు పైలా ప్రసాదరావు ఆధ్వర్యంలో మాడుగులలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేయించిన జగన్మోహన్‌రెడ్డి తన పతనానికి పునాది వేసుకున్నారని విమర్శించారు.

మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, నియోజకవర్గం ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎలమంచిలిలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పాయకరావుపేటలో సోమవారం రాత్రి టీడీపీ శ్రేణులు సెల్‌ ఫోన్ల లైట్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో టీడీపీ శ్రేణులు ‘బాబుతో నేను’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.

Updated Date - 2023-09-26T00:47:47+05:30 IST