నిరసన హోరు
ABN , First Publish Date - 2023-09-20T01:29:15+05:30 IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఏడో రోజైన మంగళవారం కూడా జిల్లా అంతటా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరాహార దీక్షలు
వైసీపీకి జనం బుద్ధి చెబుతారని నేతలు హెచ్చరిక
చంద్రబాబుకు త్వరగా బెయిల్ రావాలంటూ ఆలయాల్లో పూజలు
(ఆంధ్రజ్యోతి- న్యూస్ నెట్‌వర్క్)
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఏడో రోజైన మంగళవారం కూడా జిల్లా అంతటా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. పెందుర్తి నియోజకవర్గం లంకెలపాలెంలో ఏర్పాటు చేసిన శిబిరంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టి అన్యాయంగా జైలుకు పంపిందని, వచ్చే ఎన్నికల్లో సైకో జగన్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద తెలుగు మహిళలు నిరసన దీక్ష చేపట్టారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అడారి మంజు, కాయల ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చోడవరంలోని కొత్తూరు జంక్షన్‌లో టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు కొల్లి శ్రీనివాసరావు, గూనూరు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు పోతల ప్రకాశరావు, గొర్లె కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మాడుగులలో టీడీపీ ఇన్‌చార్జి పీవీజీ కుమార్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమ అరెస్టులు, ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు, దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పాయకరావుపేటలో టీడీపీ శ్రేణులు, బాలకృష్ణ అభిమానులు కళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఎలమంచిలిలో ఏర్పాటు చేసిన శిబిరంలో మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొలుకులూరి విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో మహిళలతో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. నక్కపల్లిలో ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరంలో తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ, చంద్రబాబునాయుడుపై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేయించిన వైసీపీ పాలకులకు రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.
తెలుగుదేశం పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబుపట్ల విశాఖ పోలీసులు అనుచితంగా ప్రవర్తించి దౌర్జన్యం చేశారని, సంబంధిత సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుచ్చెయ్యపేట మండలంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, కార్యదర్శి డొంకిన చిరంజీవి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. పౌరుల హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. రావికమతం మండలం టి.అర్జాపురంలో ఎన్టీఆర్ విగ్రహాం వద్ద పార్టీ మండల అధ్యక్షుడు రాజాన కొండనాయుడు ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.
చంద్రబాబుపై పెట్టి అక్రమ కేసుల్లో న్యాయస్థానాల్లో వీగిపోయి ఆయన నిర్దోషిగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ ఎస్.రాయవరం మండలంలో ధర్మవరం అగ్రహారం గ్రామంలో ఎంపీటీసీ సభ్యురాలు సియ్యాదుల వరహాలమ్మ ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. చీడికాడలో జడ్పీటీసీ మాజీ సభ్యురాలు పోతల రమణమ్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నీటి బిందెలు, డప్పులు, బ్యాండుమేళాలతో ఊరేగింపుగా సామాలమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి జలాభిషేకం చేశారు. చంద్రబాబుకు సత్వరమే బెయిల్ మంజూరు కావాలని అమ్మవారిని వేడుకున్నారు.
తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు ఆధ్వర్యంలో మునగపాక మండలానికి చెందిన పలువురు నాయకులు సింహాచలం వెళ్లి, గాలిగోపురం ముందు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. ఇదే మండలానికి చెందిన రాష్ట్ర తెలుగురైతు కార్యదర్శి దాడి ముసిలినాయుడు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి శ్రీనివాసరావు, మరో పదిమంది నాయకులను, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ధూళి రంగనాయకులు, తెలుగుయువత రాంబిల్లి మండల అధ్యక్షుడు ఎరిపల్లి అజయ్, తదితరులను విశాఖ పోలీసులు సింహాచలంలో అరెస్టు చేసి ఎయిర్‌పోర్ట్ స్టేషన్‌కు తరలించారు.
------
చంద్రబాబుకు పోస్టు కార్డులు
‘బాబుకు తోడుగ నేను’ అంటూ జిల్లాలోని పలు మండలాల్లో టీడీపీ కార్యకర్తలు పోస్ట్‌కార్డు ఉద్యమం నిర్వహించారు. ‘‘మీరు ఏ తప్పు చెయ్యలేదని మేమంతా నమ్ముతున్నారు. ఇన్నాళ్లూ మాకు మీరు తోడుగా ఉన్నారు. ఇకపై మేము మీకు బాసటగా వుంటాం. రాష్ట్రాభివృద్ధికి మీ వెంట నడుస్తాం. మా పిల్లలకు మంచి భవిష్యత్తును మీరు చూపించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం మీతో కలిసి నడుస్తాం’’ అంటూ పలువురు నాయకులు, కార్యకర్తలు పోస్టు కార్డులపై రాసి రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో వున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పోస్టు చేశారు.
----