క్రికెట్‌ సంబరం

ABN , First Publish Date - 2023-07-26T01:22:04+05:30 IST

విశాఖ క్రికెట్‌ క్రీడాభిమానులకు శుభవార్త. టీమిండియాతో పాటు ఆస్ర్టేలియా, ఇంగ్లండ్‌ ఆటగాళ్లు నగరంలో క్రికెట్‌ విందు అందించనున్నారు.

క్రికెట్‌ సంబరం

విశాఖలో టీ 20, టెస్టు మ్యాచ్‌లు

వేదిక ఏసీఏ-వీడీసీఏ స్టేడియం

నవంబరు 23న ఆస్ర్టేలియాతో టీ 20 సమరం

వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండు నుంచి ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌

విశాఖపట్నం (స్పోర్ట్సు), జూలై 25:

విశాఖ క్రికెట్‌ క్రీడాభిమానులకు శుభవార్త. టీమిండియాతో పాటు ఆస్ర్టేలియా, ఇంగ్లండ్‌ ఆటగాళ్లు నగరంలో క్రికెట్‌ విందు అందించనున్నారు. పీఎంపాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా నవంబరు 23న భారత్‌-ఆస్ర్టేలియా మధ్య అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌తోపాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండు నుంచి ఆరు వరకు భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య టెస్టు మ్యాచ్‌కు విశాఖ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు దేశంలో పర్యటించనున్న ఆస్ర్టేలియా, ఇంగ్లండ్‌ జట్ల టూర్లకు సంబంధించిన షెడ్యూల్‌, మ్యాచ్‌ల వేదికలను భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది.

భారత్‌-ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్‌

మన దేశంలో పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా భారత్‌తో మూడు వన్డేలు, ఐదు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరు 22 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు మొహాలి, ఇండోర్‌, రాజ్‌కోట్‌ వేదిక కాగా.... ఐదు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో నవంబరు 23న జరిగే తొలి టీ 20 మ్యాచ్‌ను విశాఖకు కేటాయించారు. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు త్రివేండ్రం, గువహటి, నాగపూర్‌, హైదరాబాద్‌లో జరుగుతాయి.

భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు మ్యాచ్‌

వచ్చే ఏడాది జనవరిలో దేశంలో పర్యటించనున్న ఇంగ్లండ్‌ జట్టు భారత్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి 25 నుంచి 29 వరకు తొలి టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్‌ వేదిక కాగా ఫిబ్రవరి రెండు నుంచి ఆరు వరకు జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియాన్ని వేదికగా బీసీసీఐ ఖరారు చేసింది. మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు రాజ్‌కోట్‌, రాంచీ, ధర్మశాల ఆతిథ్యమివ్వనున్నాయి.

ఆస్ర్టేలియా, ఇంగ్లండ్‌తో రెండోసారి

ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఇప్పటివరకు మూడు టీ 20 మ్యాచ్‌లు జరిగాయి. ఫిబ్రవరి 24, 2019న భారత్‌తో తలపడిన ఆస్ర్టేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా నవంబరు 23న జరిగే టీ20 మ్యాచ్‌లో మరోసారి ఇరుజట్లు తలపడనున్నాయి. కాగా ఏసీఏ వీడీసీఏ స్టేడియానికి టెస్టు హోదా వచ్చిన తర్వాత నవంబరు 17-21, 2019లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌-ఇంగ్లండ్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌ 246 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండున ఇదే స్టేడియంలో రెండోసారి భారత్‌, ఇంగ్లండ్‌ ఆడనున్నాయి. టీమిండియా విశాఖలో రెండోసారి ఆస్ర్టేలియాతో టీ 20, ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడనుంది.

Updated Date - 2023-07-26T01:22:04+05:30 IST