సముద్రంలో బాలుడి గల్లంతు
ABN , First Publish Date - 2023-09-20T01:00:58+05:30 IST
యారాడ వద్ద సముద్రంలో సోమవారం సాయంత్రం ఓ బాలుడు గల్లంతయ్యాడు.

యారాడ తీరంలో విషాదం
విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళుతుండగా కబళించిన కెరటం
మల్కాపురం/సింథియా, సెప్టెంబరు 19:
యారాడ వద్ద సముద్రంలో సోమవారం సాయంత్రం ఓ బాలుడు గల్లంతయ్యాడు. నిమజ్జనం సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గాజువాక సింహగిరి కాలనీకి చెందిన ఐదుగురు బాలురు (అంతా పద్దెనిమిదేళ్లులోపు వయసు కలిగినవారు) రెండు ద్విచక్ర వాహనాలపై సోమవారం మధ్యాహ్నం యారాడ వెళ్లారు. అప్పుడు సమయం మూడు గంటలు అయ్యింది. ఇంతలో యారాడ నుంచి కొంతమంది పండగను జరుపుకుని నిమజ్జనం చేసేందుకు విగ్రహాన్ని తీసుకువచ్చారు. వారితో కలిసి సింహగిరి కాలనీకి చెందిన ముసలన కల్యాణ్ (15), శివలు సముద్రంలోనికి వెళ్లారు. ఇంతలో రాకాసి అల ఒకటి...ఒక్క ఉదుటున కల్యాణ్, శివలను లోనికి లాగేసింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఈతగాళ్లు లైఫ్ బోట్‌ల సహాయంతో శివను రక్షించగలిగారు. గానీ కల్యాణ్‌ను కాపాడలేకపోయారు. న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని కల్యాణ్ కోసం నేవీ సహాయంతో గాలింపు చేపట్టారు. మంగళవారం డీసీపీ 2 ఆనంద్‌కుమార్‌రెడ్డి, న్యూపోర్టు స్టేషన్ సీఐ రాములు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. సాయంత్రం వరకూ అతని ఆచూకీ లభించలేదు.
కొడుకు కోసం కన్నీళ్లతో తీరంలో తల్లి..
‘కొడుకా...ఎక్కడున్నావ్...అమ్మను వచ్చాను...? తొందరగా రారా...నాన్న...’ అంటూ కల్యాణ్ తల్లి సంతోషి...ఒడ్డున కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది. ‘కొడుకే నా జీవనాధారం అనుకున్నాను. ఇంతలోనే ఆ దేవుడు ఇలాచేశాండేటి’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. కల్యాణ్ ఏసీ మెకానిక్ పనులు చేస్తుంటాడు.