980 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2023-09-20T01:22:43+05:30 IST

ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చిత్రకొండ పోలీసులు 980 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాహనాన్ని విడిచిపెట్టి పరారయ్యారు. పోలీసులు వ్యాన్‌, లారీని సీజ్‌ చేశారు. దీనికి సంబంధించి చిత్రకొండ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

980 కిలోల గంజాయి పట్టివేత
చిత్రకొండ పోలీసులు స్వాధీనం చేసుకన్న గంజాౄయి

ఒడిశా నుంచి ఏపీకి తరలిస్తుండగా పట్టుకున్న చిత్రకొండ పోలీసులు

వాహనాన్ని వదిలేసి పరారైనన నిందితులు

సీలేరు, సెప్టెంబరు 19: ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చిత్రకొండ పోలీసులు 980 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాహనాన్ని విడిచిపెట్టి పరారయ్యారు. పోలీసులు వ్యాన్‌, లారీని సీజ్‌ చేశారు. దీనికి సంబంధించి చిత్రకొండ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

ఒడిశా రాష్ట్రం చిత్రకొండ స్టేషన్‌ పోలీసులు ఆదివారం రాత్రి ఏపీ వైపు వచ్చే రోడ్డులో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఒడిశా నుంచి ఏపీ వైపు వెళుతున్న బొలేరో పికప్‌ వ్యాన్‌ను తనిఖీ నిమిత్తం ఆపే ప్రయత్నం చేశారు. అయితే డ్రైవర్‌ ఆపకుండా వేగంగా పోనివ్వడంతో పోలీసులు వెంబడించారు. గంజాయి రవాణాదారులు, పోలీసులను నిలువరించేందుకు వ్యాన్‌లో ఉన్న గంజాయి బస్తాలను ఒక్కొక్కటిగా రోడ్డుపై పడేస్తూ వెళ్లారు. అయినప్పటికీ పోలీసులు వెంబడిస్తుండడంతో నిందితులు ధారకొండ ఘాట్‌ రోడ్డులో వాహనాన్ని ఆపి పరారయ్యారు. పోలీసులు వ్యాన్‌ను, గంజాయి బస్తాలను స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన గంజాయి 980 కేజీలు వున్నట్టు నిర్ధారించారు. గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేసి చిత్రకొండ మీదుగా ఏపీకి తరలిస్తున్నట్టు ఒడిశా పోలీసులు గుర్తించారు. కాగా గంజాయి రవాణాదారులు వ్యాన్‌ వదిలిపెట్టిన ప్రదేశంలో ఒక లారీ ఆగివుంది. దీనిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-09-20T01:22:43+05:30 IST