రెవెన్యూలో 85 మంది బదిలీ

ABN , First Publish Date - 2023-06-03T01:18:55+05:30 IST

జాబితాలో 32 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 28 మంది సీనియర్‌ అసిస్టెంట్లు

రెవెన్యూలో 85 మంది బదిలీ

జాబితాలో 32 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 28 మంది సీనియర్‌ అసిస్టెంట్లు

డాబాగార్డెన్స్‌, జూన్‌ 2:

జిల్లాలోని రెవెన్యూ విభాగంలో 85 మందిని బదిలీ చేస్తూ కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో 32 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 28 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 12 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, 11 మంది ఆఫీస్‌ సబార్డినేట్‌లు ఉన్నారు. జిల్లాల పునర్విభజన తరువాత తొలిసారిగా జరిగిన ఈ బదిలీల్లో అనకాపల్లి నుంచి విశాఖపట్నం వచ్చే వారికి కలెక్టర్‌ అనుమతి ఇవ్వలేదు. అల్లూరి జిల్లా నుంచి కూడా కొంతమంది డిప్యూటీ తహసీల్లార్లు విశాఖకు వచ్చేందుకు యత్నిస్తున్నా...ఇరు జిల్లాల కలెక్టర్‌లు అందుకు ఆమోదం తెలపలేదు.

పౌర సరఫరాల శాఖలో...

జిల్లా పౌర సరఫరాల శాఖలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న పలువురు చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. బదిలీ అయిన చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌లో ఒకరిద్దరిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్న వారిని బెదిరించి డబ్బులు గుంజుకుంటున్న వైనాన్ని రెండు రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిని జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది.

వివాదాస్పదమైన బదిలీలు...

జల వనరుల శాఖలో చేపట్టిన బదిలీలపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. చోడవరంలో పనిచేస్తున్న దివ్యాంగుడైన సీనియర్‌ అసిస్టెంట్‌ను పాడేరు బదిలీ చేశారు. సదరు దివ్యాంగుడు రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్నారు. రెండేళ్లలోపు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులను, దివ్యాంగులను ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేయకూడదని నిబంధనలు వున్నట్టు పేర్కొంటున్నారు. నిబంధనల విరుద్ధంగా చేపట్టిన బదిలీలను వెంటనే రద్దు చేయాలని లేకపోతే ఆందోళన చేపడతామని పలువురు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో 14 ఏళ్లుగా పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను తక్షణమే బదిలీలు చేయాలని డిమాండ్‌ చేశారు.

జిల్లా సహకార అధికారిగా నియమితులైన ప్రవీణ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. విశాఖలో ఇప్పటి వరకు పనిచేసిన మిల్టాన్‌ బాధ్యతల నుంచి రిలీవయ్యారు.

Updated Date - 2023-06-03T01:18:55+05:30 IST