పోలీస్‌ కమిషనరేట్‌లో కొత్తగా 8 సీఐ పోస్టులు

ABN , First Publish Date - 2023-09-22T01:13:04+05:30 IST

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సీఐ పోస్టుల పెంపునకు సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ప్రతిపాదనలు పంపించారు.

పోలీస్‌ కమిషనరేట్‌లో కొత్తగా 8 సీఐ పోస్టులు

ప్రస్తుతం ఎస్‌ఐ స్థాయి అధికారులు ఉన్న పోస్టులు అప్‌గ్రేడ్‌

సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ప్రతిపాదనలు

విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సీఐ పోస్టుల పెంపునకు సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం ఎస్‌ఐ స్థాయి అధికారులు పనిచేస్తున్న పోస్టుల్లో ఇకపై సీఐ స్థాయి అధికారులను నియమించేందుకు వీలుగా ప్రతిపాదనలు తయారుచేసి గురువారం విశాఖ రేంజ్‌ డీఐజీకి పంపించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగు తున్నందున వాటిని నియంత్రించేందుకు హైవే పెట్రోలింగ్‌ కోసం ఒక సీఐ అవసరం ఉందని సీపీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్‌ఐ స్థాయి అధికారి పనిచేస్తున్న ఆ పోస్టును సీఐ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు. అలాగే నగరానికి ప్రముఖుల తాకిడి పెరుగతుండడంతో ఎయిర్‌పోర్టులో ప్రోటోకాల్‌ విధుల కోసం ఒక సీఐను ప్రత్యేకంగా ఉంచాల్సిన అవసరం ఉందని సీపీ భావిస్తున్నారు. ప్రస్తుతం ఎస్‌ఐ స్థాయి అధికారి ప్రోటోకాల్‌ విధులు చూస్తున్నారు. అలాగే టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో ప్రస్తుతం ఏసీపీతోపాటు ఇద్దరు ఎస్‌ఐలు ఉండగా, ఎస్‌ఐ పోస్టులను జోన్‌-1, జోన్‌-2 సీఐలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రతిపాదనల్లో పొందుపరిచారు. కోర్టు మానటరింగ్‌ సిస్టమ్‌, లైజన్‌ ఆఫీసర్‌గా ఇప్పుడున్న ఎస్‌ఐ పోస్టును సీఐ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు. సైబర్‌ క్రైమ్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌లకు సంబంధించి జోన్‌-2కి ప్రత్యేకంగా ఒక్కో ఎస్‌ఐ పోస్టు ప్రస్తుతం ఉండగా...వీటిని ఇకపై సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు. నగరంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు పెరగడంతో వాటిపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేందుకు వీలుగా స్పెషల్‌బ్రాంచిలో ఇప్పుడున్న ఎస్‌ఐ పోస్టును కూడా సీఐ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేయాలని సీపీ భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలపై తగిన గణాంకాలను తెలుసుకునేందుకు ట్రాఫిక్‌, స్పెషల్‌బ్రాంచి ఏడీసీపీలతోపాటు టాస్క్‌ఫోర్స్‌, దిశ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీలు, సైబర్‌ క్రైమ్‌ సీఐలతో గురువారం సీపీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సీఐ పోస్టుల అప్‌గ్రేడేషన్‌ అమల్లోకి వస్తుందని పోలీస్‌ కమిషనరేట్‌ వ ర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-09-22T01:13:04+05:30 IST