ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులకు 3.5 లక్షలు దరఖాస్తులు

ABN , First Publish Date - 2023-09-26T01:27:42+05:30 IST

ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి 3.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు.

ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులకు 3.5 లక్షలు దరఖాస్తులు

వచ్చే నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా

ల్యాండ్‌ పూలింగ్‌ రైతులకు కన్వేయన్స్‌ డీడ్‌లు

కలెక్టర్‌ మల్లికార్జున

విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):

ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి 3.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు రాలేదని, ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం వచ్చిందని అన్నారు. మొత్తం దరఖాస్తుల్లో సగం వరకు ఫారం-8...అంటే ఇంటి అడ్రస్‌ మార్పు, తప్పుల సవరణ, ఫొటో మార్పు వంటి వాటికి సంబంధించినవి ఉన్నాయన్నారు. మిగిలినవి ఫారం-6 (కొత్త ఓటర్ల నమోదు), ఫారం-8 (తొలగింపులు) దరఖాస్తులన్నారు. మూడు రకాల కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తుల్లో సగం మేర బీఎల్‌వోలు పరిశీలించి పరిష్కరించి వివరాలను ఎన్నికల పోర్టల్‌లో నమోదు చేయగా, మిగిలినవి త్వరలో పరిష్కరిస్తారన్నారు. వచ్చే నెల 17న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేస్తామని, ఆ తరువాత అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. పోలింగ్‌కు పది రోజుల ముందు వరకు ఓటర్ల జాబితాలో నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

జగనన్న కాలనీల కోసం భూములు ఇచ్చిన రైతులకు కన్వేయన్స్‌ డీడ్స్‌ను రిజిస్టర్‌ చేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. రైతుల పేరిట ప్లాట్లు ఉచితంగా రిజిస్టర్‌ చేస్తున్నామన్నారు. రైతులకు ప్లాట్లు ఇచ్చే 43 లేఅవుట్లు, పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 73 జగనన్న కాలనీల్లో రూ.2,200 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు జగనన్న కాలనీల్లో వసతులకు సంబంధించి రూ.150 కోట్లు విలువైన పనులు చేశామని, రైతులకు ఇచ్చిన లేఅవుట్‌లలో రూ.250 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. పెదజాలరిపేటలో మత్స్యకారులకు గతంలో ఇచ్చిన పట్టాల మేరకు సర్వే చేపట్టామని, అయితే వారి హక్కులకు ఎటువంటి భంగం కలగదని హామీ ఇచ్చారు. గ్రామంలో నివాసం ఉంటున్న మత్స్యకారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2023-09-26T01:27:42+05:30 IST