2 వర్సిటీలు, 2 దేశాలు
ABN , First Publish Date - 2023-06-03T01:21:35+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయం పలు కోర్సుల నిర్వహణకు విదేశీ విద్యా సంస్థలతో (ట్విన్నింగ్ ప్రోగ్రామ్) ఒప్పందం చేసుకుంటోంది.
ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌కు పలు విదేశీ యూనివర్సిటీలతో ఏయూ ఒప్పందం
ఇక్కడ సగం, అక్కడ సగం కోర్సు పూర్తిచేసేందుకు అవకాశం
ఇప్పటికే పలు కోర్సులు అందుబాటులోకి, మరికొన్ని ఈ ఏడాది, వచ్చే ఏడాది ప్రారంభం
‘గ్లోబలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్’
కార్యక్రమంలో భాగంగా అమలు
ప్రపంచవ్యాప్తంగా 100 యూనివర్సిటీలను ఎంపిక చేసి విద్యా సంస్థలకు పంపిన కేంద్రం
ఖర్చు సగానికిపైగా తగ్గుతుందంటున్న వర్సిటీ అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆంధ్ర విశ్వవిద్యాలయం పలు కోర్సుల నిర్వహణకు విదేశీ విద్యా సంస్థలతో (ట్విన్నింగ్ ప్రోగ్రామ్) ఒప్పందం చేసుకుంటోంది. ఇప్పటికే కొన్ని కోర్సులు ప్రారంభం కాగా, మరికొన్ని ఈ ఏడాది, వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నట్టు అధికారులు చెబుతున్నారు. గ్లోబలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ప్రపంచంలో ఎంపిక చేసిన వంద విశ్వవిద్యాలయాల్లో మన విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఇప్పటివరకు పదికిపైగా వర్సిటీలతో ఒప్పందాలు చేసుకోగా, మరో పదింటితో ఒప్పందాలు చేసుకోవాల్సి వున్నదని రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ తెలిపారు. ట్విన్నింగ్ ప్రోగ్రామ్ అంటే... ఒప్పందం చేసుకున్న రెండు విద్యా సంస్థలు సంయుక్తంగా కోర్సును నిర్వహిస్తాయి. రెండేళ్ల కోర్సు అయితే...విద్యార్థులు ఒక ఏడాది ఏయూలో, మరో ఏడాది విదేశాల్లోని సదరు యూనివర్సిటీలో చదువుకునే అవకాశం కల్పిస్తారు. సాధారణంగా విదేశాలకు వెళ్లి ఆయా యూనివర్సిటీల్లో చదవాలంటే రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. ఈ ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లో అయితే రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలతో కోర్సు పూర్తిచేయవచ్చునని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. కోర్సు పూర్తయిన తరువాత మూడేళ్లపాటు అక్కడే ఉండి పరిశోధన, ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటును కొన్ని యూనివర్సిటీలు కల్పిస్తున్నాయి.
అనేక వర్సిటీలతో ఒప్పందాలు
ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులకు సంబంధించి స్వీడన్‌కు చెందిన వర్సిటీతో ఏయూ ఒప్పందం చేసుకుంది. ఒక్కో బ్యాచ్‌లో 30 మంది విద్యార్థులు ఉంటారు. ఇప్పటికే ఒక బ్యాచ్ విద్యార్థులు స్వీడన్‌లోనూ కోర్సు పూర్తిచేశారు. ఏయూలో రెండేళ్ల కోర్సు పూర్తిచేసిన తరువాత..మిగిలిన రెండేళ్ల కోర్సును విద్యార్థులు అక్కడ పూర్తిచేశారు. అలాగే, ఎంఎస్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కోర్సును అమెరికాలోని మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో కలిసి ఏయూ అందిస్తోంది. గత ఏడాది నుంచి ఈ కోర్సు అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది 30 మంది విద్యార్థులు రెండో ఏడాది పూర్తిచేసేందుకు అమెరికా వెళ్లారు. విదేశాల్లో ఈ కోర్సులో చేయాలంటే రూ.50 లక్షలు ఖర్చవుతుందని, కానీ, ఏయూ చేసుకున్న ఒప్పందం వల్ల ఏయూలో, అమెరికాలో కలిపి రూ.15 లక్షలలోపు ఖర్చుతో కోర్సు అయిపోతుందని వర్సిటీ అధికారులు వెల్లడించారు. కోర్సు పూర్తిచేసిన తరువాత అక్కడే మూడేళ్లపాటు విద్యార్థులు పని చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా ఎంఎస్ డేటా సైన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సుకు సంబంధించి అమెరికాలోని స్ర్కాంటన్ యూనివర్సిటీతో ఏయూ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది నుంచి ఈ కోర్సు అందుబాటులోకి రానుంది. సాధారణంగా అక్కడ ఎంఎస్ చేయాలంటే రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు ఖర్చవుతుందని, ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లో అయితే రూ.20 లక్షలకు మించి కాదని అధికారులు చెబుతున్నారు. ఈ కోర్సులో చేరేందుకు ప్రస్తుతం 150 వరకు దరఖాస్తులు వచ్చాయి. పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని అడ్మిషన్ ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు. చదువు పూర్తయిన తరువాత ప్రాజెక్టు ఇంటర్న్‌షిప్ చేసుకునే అవకాశం, ఉద్యోగం చేసుకునే వెసులుబాటును ఆ వర్సిటీ కల్పించేలా ఒప్పందం చేసుకున్నట్టు ఏయూ అధికారులు తెలిపారు. వీటితోపాటు ఆస్ర్టేలియాలోని సిడ్నీలో గల ఒక ప్రముఖ యూనివర్సిటీతో ఇదే విధమైన ఒప్పందం చేసుకునే పనిలో ఉన్నారు. అలాగే నెదర్లాండ్స్‌లోని వేగ్నింగెన్ యూనివర్సిటీతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఫుడ్ సైన్స్ కోర్సుల్లో ప్రపంచంలోనే నంబర్‌వన్ యూనివర్సిటీగా దీనికి గుర్తింపు ఉంది.
విదేశాల్లో మరిన్ని అవకాశాలు కల్పించేలా..
- ప్రొఫెసర్ వి.కృష్ణమోహన్, ఏయూ రిజిస్ర్టార్
నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలో పేరొందిన వంద యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థులు చదువుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా యూనివర్సిటీలతో దేశీయ వర్సిటీలు ఒప్పందం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అందుకు అనుగుణంగానే పలు వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్‌ను అమలు చేస్తున్నాం. ఇక్కడ ఏడాది, అక్కడ ఏడాది చదువుకునేలా అనేక కోర్సులు అందిస్తున్నాం. సాధారణంగా అయితే విద్యార్థులు ఆయా దేశాలకు వెళ్లి ఆ కోర్సులు పూర్తి చేయాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధానం వల్ల 60-70 శాతం ఖర్చు తగ్గుతోంది. దీనివల్ల విద్యార్థులకు ఆయా దేశాల్లో విద్య, ఉపాధి అవకాశాలు భారీగా మెరుగుపడుతున్నాయి.