ఏజెన్సీకి 12 ఎన్‌ఆర్‌ఎస్‌టీసీలు
ABN , First Publish Date - 2023-09-20T01:23:47+05:30 IST
విద్యా శాఖ అధికారులు ఏజెన్సీ ప్రాంతానికి 12 నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లను (ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ) మంజూరు చేశారు. వాటిని పాఠశాలలు లేని మారుమూల గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు. ఇటీవల ఏజెన్సీలో విద్యార్థుల స్థితిగతులపై విద్యా శాఖాధికారులు వివరాలు సేకరించారు. మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు లేక కొంతమంది విద్యార్థులు, పాఠశాలలు దూరంగా ఉండడం వల్ల మరికొంత మంది విద్యార్థులు విద్యకు దూరవుతున్నారని గుర్తించారు.

పాఠశాలలు లేని మారుమూల గ్రామాల్లో ఏర్పాటు
డీఎడ్ అర్హతతో విద్యా వలంటీర్ల నియామకం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
విద్యా శాఖ అధికారులు ఏజెన్సీ ప్రాంతానికి 12 నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లను (ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ) మంజూరు చేశారు. వాటిని పాఠశాలలు లేని మారుమూల గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు. ఇటీవల ఏజెన్సీలో విద్యార్థుల స్థితిగతులపై విద్యా శాఖాధికారులు వివరాలు సేకరించారు. మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు లేక కొంతమంది విద్యార్థులు, పాఠశాలలు దూరంగా ఉండడం వల్ల మరికొంత మంది విద్యార్థులు విద్యకు దూరవుతున్నారని గుర్తించారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాఠశాల లేని గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, అందులో విద్యార్థులకు ప్రాథమిక బోధన చేస్తారు. ఈ సెంటర్లలో డీఎడ్ పూర్తి చేసిన వారిని విద్యావలంటీర్‌గా నియమిస్తారు. ఈ ఏడాది నవంబరు నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వీటిని నిర్వహిస్తారు.
ఎన్‌ఆర్‌ఎస్‌టీసీలు ఏర్పాటు చేసే గ్రామాలివే...
మన్యంలో నాలుగు మండలాల పరిధిలో 12 గ్రామాల్లో నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ముంచంగిపుట్టు మండలం గడ్డిబంద, బరెంగులు, లుక్కూరు, టిక్కరపడ, లబ్బూరు, బొర్రపనస; చింతపల్లి మండలం తుప్పులమామిడి, లక్కవరం; జీకేవీధి మండలం పెదలంక, ఈ.గొందిపల్లిలో; హుకుంపేట మండలం మెరకచింత, మదుము గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఆయా గ్రామాల్లో డీఎడ్ అర్హత కలిగిన అభ్యర్థులుంటే విద్యావలంటీర్‌గా పని చేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చునని సమగ్ర శిక్ష అదనపు సంచాలకుడు గౌరీశంకర్ తెలిపారు. అభ్యర్థులు సంబంధిత మండల విద్యా శాఖాధికారిని సంప్రదించాలన్నారు.