రియల్టర్‌ కిడ్నాప్‌ కేసులో 11 మంది అరెస్టు

ABN , First Publish Date - 2023-02-21T01:05:14+05:30 IST

నగరంలో సంచలనం సృష్టించిన రియల్టర్‌ కాపోజు మధుసూదనరావు (33) కిడ్నాప్‌ కేసులో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

రియల్టర్‌ కిడ్నాప్‌ కేసులో 11 మంది అరెస్టు

నిందితుల్లో ఇద్దరు మాజీ కానిస్టేబుళ్లు

రూ.7.75 లక్షల నగదు, 11 సెల్‌ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం

మహారాణిపేట, పిబ్రవరి 20:

నగరంలో సంచలనం సృష్టించిన రియల్టర్‌ కాపోజు మధుసూదనరావు (33) కిడ్నాప్‌ కేసులో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో సస్పెన్షన్‌లో వున్న ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లు వుండడం విశేషం. పోలీస్‌ కమిషనరేట్‌లోని సమావేశమందిరంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీపీ సీహెచ్‌ శ్రీకాంత్‌ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

పెదరుషికొండ ప్రాంతానికి చెందిన కాపోజు మధుసూదనరావు (33) స్టాక్‌ ట్రేడింగ్‌తో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో భీమిలికి చెందిన కోలా వెంకట హేమంత్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. విల్లా కొనుగోలుకు ఒక పార్టీ సిద్ధంగా ఉందని, ఎక్కడైనా అందుబాటులో వుంటే చూడాలని ఈ నెల 14వ తేదీన మధుసూదనరావుకు హేమంత్‌కుమార్‌ ఫోన్‌ చేశాడు. మరుసటిరోజు (పదహేనవ తేదీ) హేమంత్‌ ఫోన్‌ చేసి విల్లా కోసం పార్టీ కలుస్తానంటోందంటూ మధుసూదనరావుకు చెప్పాడు. దీంతో మధుసూదనరావు తన కారులో బాలాజీ బే మౌంట్‌రోడ్డుకు చేరుకున్నాడు. అక్కడ హేమంత్‌కుమార్‌తోపాటు విజయనగరం జిల్లా ఎస్‌.కోటకు చెందిన పాండ్రంకి ప్రసాద్‌ (31), అనకాపల్లి జిల్లా తాండవకు చెందిన గుడపర్తి చిన్న (19), మరో ఇద్దరు ఉన్నారు. అంతా కలిసి మధుసూదనరావును బలవంతంగా హేమంత్‌ తెచ్చిన కారులోకి ఎక్కించుకున్నారు. దారిలో మధుసూదనరావును కట్టేసి అతని మెడలోని బంగారు చైన్‌, వేళ్లకు వున్న నాలుగు ఉంగరాలను లాక్కున్నారు. తర్వాత నగర శివారులోని ఒక లేఅవుట్‌లో కారు ఆపి క్షేమంగా ఇంటికి వెళ్లాంటే రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ డిమాండ్‌ చేశారు. అంత డబ్బు తన వద్ద లేదని మధుసూదనరావు చెప్పడంతో అతడి ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాలో వున్న రూ.నాలుగు లక్షలను ఆన్‌లైన్‌లో హేమంత్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. మరింత డబ్బు కోసం మధుసూదనరావు భార్యకు హేమంత్‌ ఫోన్‌ చేశాడు. ఆమె తన బంగారు వస్తువులను తాకట్టు పెట్టి మధుసూదనరావు స్నేహితుడైన జగదీశ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా హేమంత్‌కు మరో ఎనిమిది లక్షల రూపాయలను పంపించారు. 16వ తేదీ రాత్రి కిడ్నాపర్ల చెర నుంచి మధుసూదనరావు తప్పించుకుని పీఎం పాలెం చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టి...ప్రధాన నిందితుడు కోలా వెంకట హేమంత్‌కుమార్‌తోపాటు పాండ్రంకి ప్రసాద్‌ (31), గుడపర్తి చిన్నా (19), నగరంలోని దొండపర్తికి చెందిన దమ్ము సాగర్‌ శరత్‌తేజ (21), దమ్ము సాగర్‌నివాస్‌ (22), కూర్మన్నపాలేనికి చెందిన గంధవరపు తరుణ్‌కుమార్‌ (32), అనకాపల్లి జిల్లా కృష్ణాదేవిపేటకు చెందిన సూర్ల నాగగణేష్‌ (21), మన్యం జిల్లాకు చెందిన మాజీ కానిస్టేబుల్‌ జీరెడ్డి అప్పలనాయుడు, విజయనగరం జిల్లాకు చెందిన మాజీ కానిస్టేబుల్‌ బింపోలు రాంబాబు, ఎస్‌.కోటకు చెందిన తమ్మన జగదీశ్‌ (32), అనకాపల్లి జిల్లా చెట్టుపల్లికి చెందిన బలిరెడ్డి నానాజీ (25)లను అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు. వీరిలో హేమంత్‌కుమార్‌ గతంలో అక్కయ్యపాలెంలో మాజీ కార్పొరేటర్‌ బోగసముద్రపు విజయారెడ్డి హత్య కేసులో నిందితుడని, అతనిపై భీమిలిలో రౌడీషీట్‌ ఉందని, త్వరలో పీడీయాక్ట్‌ ప్రయోగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. హేమంత్‌ జైలులో వున్నప్పుడు గంజాయి రవాణా కేసులో నిందితులుగా అక్కడ వున్న పోలీసు కానిస్టేబుళ్లు జీరెడ్డి అప్పల నాయుడు, బింపోలు రాంబాబుతో పరిచయమైందన్నారు. తర్వాత కూడా వారి మధ్య స్నేహం కొనసాగుతోందని వివరించారు. నిందితుల నుంచి రూ.7.75 లక్షల నగదు, 11 సెల్‌ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ-1 సుమిత్‌సునీల్‌, క్రైమ్‌ డీసీపీ జి.నాగన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T01:05:16+05:30 IST