దీవెన కొందరికే..

ABN , First Publish Date - 2023-03-26T01:22:32+05:30 IST

‘క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికంలో చెల్లిస్తున్నాం. జగనన్న దీవెన కింద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నాం. ఒక్కసారి బటన్‌ నొక్కగానే 24 గంటల్లోగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది’.. ఇదీ పాలకులు చెప్పుకునే గొప్పలు. అయితే క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలుకావడం లేదన్న ఆరోపణలున్నాయి.

దీవెన కొందరికే..
జిల్లాలో ఈ నెల 19న తల్లులు, విద్యార్థులకు విద్యా దీవెన నమూనా చెక్కు అందిస్తున్నప్పటి చిత్రం

- జిల్లాలో ఇప్పటికీ సగానికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమకాని నగదు

- రోజూ ఎదురుచూపులు

- ఫీజులు చెల్లించాలని ప్రైవేటు విద్యా సంస్థల ఒత్తిళ్లు

- దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

‘క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికంలో చెల్లిస్తున్నాం. జగనన్న దీవెన కింద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నాం. ఒక్కసారి బటన్‌ నొక్కగానే 24 గంటల్లోగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది’.. ఇదీ పాలకులు చెప్పుకునే గొప్పలు. అయితే క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలుకావడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ నెల 19న సీఎం జగన్మోహన్‌రెడ్డి విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేస్తూ బటన్‌ నొక్కగా ఇప్పటికీ జిల్లాలో సగానికి పైగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాలేదు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.

విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేస్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ఆరు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాకపోవడంతో పలువురు విద్యార్థుల తల్లులు ఏం జరిగిందో తెలియక టెన్షన్‌ పడుతున్నారు. బ్యాంకు నుంచి మెసేజ్‌ వచ్చిందో లేదోనని రోజూ చూసుకుంటున్నారు. కాగా ఇప్పటి వరకు ఫీజు ఎందుకు చెల్లించలేదంటూ కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇంకా డబ్బులు పడలేదని చెబుతున్నా కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు నమ్మడం లేదు. ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు జరగుతున్నాయి. కొన్ని కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. దీంతో చేసేది లేక కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి, కళాశాలలకు కొంతమొత్తం డబ్బు చెల్లించి హాల్‌ టికెట్లు తీసుకొని పిల్లలతో పరీక్షలు రాయిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో 2022-23 ఆర్థిక విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొత్తం 40,164 మంది విద్యార్థులకు రూ.23.89 కోట్ల జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల అయ్యాయి. ఈ పథకం కింద వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ పరిధిలో 36,474 మంది విద్యార్థులకు రూ.21.07 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ పరిఽధిలో 2,940 మంది విద్యార్థులకు రూ.2.46 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ కింద 498 మంది విద్యార్థులకు రూ.20.64 లక్షలు, ముస్లిం మైనారిటీ సంక్షేమం కింద మరో 252 మంది విద్యార్థులకు రూ.15.83 లక్షలు కేటాయించారు.

కొందరికి మాత్రమే నగదు జమ

కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అజయ్‌బాబు ఆధ్వర్యంలో కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఈ నెల 19న విద్యా దీవెన నమూనా చెక్కును ఆవిష్కరించారు. అయితే ఇప్పటి వరకు సగానికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమకాలేదు. కేవలం 8.50 కోట్లు మాత్రమే విడుదలైనట్టు తెలిసింది. మిగతా వారికి ఏ కారణంతో విద్యా దీవెన నగదు జమ కాలేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. జిల్లా అధికారుల ఆన్‌లైన్‌ లాగిన్‌లోనూ వివరాలు కనిపించడం లేదు. కేవలం నగదు బ్యాంకులకు విడుదలైనట్టు మాత్రమే చూపుతోంది.

--------------------

ఆందోళన అవసరం లేదు (ఫొటో- 25ఏకేపీ.2)

జిల్లాలో ఈ ఏడాది విద్యా దీవెన నగదు జమ విషయంలో కొద్దిగా ఆలస్యం కావడం వాస్తవమే. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో ఒక్కరోజులోనే విద్యా దీవెన నిధులు జమ అయ్యాయి. ఈసారి సాంకేతిక కారణాలు, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలతో ఆధార్‌, ఫోన్‌ నంబర్ల లింకేజీ కాకపోవడం వంటి కారణాలతో కొద్దిరోజులు ఆలస్యం అయింది. నగదు జమ కాని తల్లులు విద్యార్థుల ఐడీ నంబర్‌, బ్యాంకు ఖాతా నంబర్‌తో స్థానిక గ్రామ సచివాలయాలకు వెళ్లి సంక్షేమ సహాయకుడిని సంప్రతిస్తే ఏ కారణంతో డబ్బు జమ కాలేదో తెలుస్తుంది. అన్ని అర్హతలు ఉన్నా నగదు రానివారికి విద్యా దీవెన నిధులు కేటాయింపులు జరిగి బ్యాంకుల్లో ఉన్నందున ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాల్లో ఒకటి రెండు రోజుల్లో విద్యాదీవెన నగదు జమ అవుతుంది.

- అజయ్‌బాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ

Updated Date - 2023-03-26T01:22:32+05:30 IST