Vijayasai Reddy: న్యాయవ్యవస్థపై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-02-07T18:59:16+05:30 IST
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై రాజ్యసభ చైర్మన్ పదే పదే ప్రశ్నించారు.
ఢిల్లీ: న్యాయవ్యవస్థపై రాజ్యసభ (Rajya Sabha) ఎంపీ, వైసీపీ (YCP) సీనియర్ నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ రాజధాని (AP Capital) విషయంలో కోర్టు పరిధి దాటి ప్రవర్తించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి ఆధారాలున్నాయా అని రాజ్యసభ చైర్మన్ విజయసాయిని ప్రశ్నించారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని.. కానీ హైకోర్టు (High Court) రాష్ట్రానికి శాసనాధికారం లేదని తీర్పు ఇచ్చిందని విజయసాయి రెడ్డి తెలిపారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై రాజ్యసభ చైర్మన్ పదే పదే ప్రశ్నించారు. రాజధాని ఒకచోట, హైకోర్టు మరోక చోట ఉన్న రాష్ట్రాలు లేవా? అని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని పాపం బీజేపీ (BJP), కాంగ్రెస్ (CONGRESS)లదేనని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. హామీలను నెరవేర్చకపోతే ఎలా? అని విజయసాయిరెడ్డి కేంద్రాన్ని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ మర్చిపోయిందని, పార్లమెంట్ (Parliament) తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special status) ఇవ్వాలని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) డిమాండ్ చేశారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని ఎంపీ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం(Central Govt)పై ఉందని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.