Anam Expelled: ఆనంకు ఘోర అవమానం.. నిజాలు మాట్లాడితే జీర్ణించుకోలేకపోయిన జగన్ ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2023-01-03T18:04:19+05:30 IST

వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి అవమానం జరిగింది. ప్రజా సమస్యలపై గొంతెత్తిన పాపానికి అన్యాయంగా ఆయనను పార్టీ నుంచి తప్పిస్తూ..

Anam Expelled: ఆనంకు ఘోర అవమానం.. నిజాలు మాట్లాడితే జీర్ణించుకోలేకపోయిన జగన్ ఏం చేశారంటే..

వెంకటగిరి: వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి అవమానం జరిగింది. ప్రజా సమస్యలపై గొంతెత్తిన పాపానికి అన్యాయంగా ఆయనను పార్టీ నుంచి తప్పిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా (Nellore YCP) వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే (Venkatagiri YCP MLA) ఆనం రామనారాయణరెడ్డిపై (Anam Ramanarayana Reddy) అధిష్టానం వేటేసింది. పార్టీకి నష్టం కలిగించేలా ఆనం వ్యాఖ్యలు (Anam Comments), వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ (YS Jagan).. వైసీపీ నుంచి ఆనంను (Anam Expelled) బహిష్కరించారు. జగన్‌ ప్రభుత్వ తీరుపై అధికార పక్ష ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ‘నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశాం..? ఏం చేశామని ఓట్లడగాలి..? గ్రామాల్లో ఒక్క రోడ్డు వేయలేదు. కనీసం ఓ గుంతకు కూడా తట్టెడు మన్నుపోసి పూడ్చలేకపోయాం’ అని ఆనం ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరులో డిసెంబర్ 28, 2022న వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల గ్రామ సచివాలయం కన్వీనర్ల తొలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వెంకటగిరిలో కూడా సచివాలయ కన్వీనర్లకు సమన్వయ సమావేశం నిర్వహించారు. పెన్షన్‌ ఇస్తే ఓట్లు వేసేస్తారా.. పథకాలు ఇస్తే ఓట్లు వేసేస్తారా.. పేదలు నాలుగు ముద్దలు నోట్లో వేసుకుంటే తాగేందుకు బిందెడు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని ఈ సందర్భంగా ఆయన ఆక్షేపించారు. ‘కేవలం పెన్షన్‌ ఇస్తేనే ఓట్లు వేస్తారా!? అలా అయితే గత టీడీపీ ప్రభుత్వంలో సైతం పెన్షన్లు ఇచ్చారు. అయితే వారి కంటే కొంత ఎక్కువ ఇస్తున్నాం. కేవలం ప్లాట్లు ఇచ్చాం తప్ప ఒక్కటంటే ఒక్క ఇల్లయినా నిర్మించామా’ అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో ముందజలో ఉందని.. కానీ అభివృద్ధిలో పూర్తి స్థాయిలో వెనుకంజ వేస్తోందని విమర్శించారు.

అంచనాలు సిద్ధం చేసి హైకమాండ్‌కు పంపినా స్పందించలేదని చెప్పారు. అమృత్‌-2 పథకం కింద కేంద్రప్రభుత్వ నిధులతో వెంకటగిరిలో రూ.93కోట్లతో మరో సమ్మర్‌ స్టోరేజి ఏర్పాటుకు అనుమతులు అందాయన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా తాగునీటి వసతి లేక వాటిని ప్రారంభించలేదన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులు ఎక్కడో అక్కడ సర్దుకుంటూ పోతున్నారని తెలిపారు. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల ముందుకు ఎలా వెళ్లి ఓట్లు అడగాలని నిలదీశారు. కేంద్రం జలజీవన్‌ మిషన్‌ ద్వారా నిధులు ఇస్తుంటే ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ కలగా పిలుచుకునే సోమశిల, స్వర్ణముఖి కెనాల్‌ను నిజం చేయలేకపోతున్నట్లు చెప్పారు. కనీసం ప్రాజెక్టు పనుల శంకుస్థాపనకు పిలిచినా రాలేదంటూ ముఖ్యమంత్రి జగన్‌పై పరోక్షంగా విమర్శలు సంధించారు.

కండలేరు డ్యాం నిర్మాణం కోసం.. పుట్టిన ఊళ్లను వదులుకుని వచ్చినవారికి ఎలాంటి వసతీ కల్పించలేకపోయామన్నారు. కనీసం వాళ్ల దాహార్తి కూడా తీర్చలేకపోయినట్లు చెప్పారు. పరిహారం కోసం ఇప్పటికీ బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగేళ్లు గడిచాయి.. మరో ఏడాది పోరాడండని పార్టీ పెద్దలు చెబుతున్నారని.. పోరాడి పైకెక్కి కూర్చోవాలని తమకూ ఉంటుందని.. కానీ దానికి మార్గమెలాగని ప్రశ్నించారు. ఆనం తాజాగా మంగళవారం నాడు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలుంటాయని వార్తలొస్తున్నాయి. అవే వస్తే మేమంతా ముందే ఇంటికి వెళ్లడం ఖాయం’ అని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వైసీపీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఆనంను పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. వెంకటగిరి నియోజవర్గ ఇంఛార్జ్‌గా నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియమించాలని జగన్ భావిస్తున్నారు. త్వరలో వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇలా జరుగుతుందని ముందే చెప్పిన ఆనం

‘‘వెంకటగిరి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. 2024 వరకు నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. సంవత్సరం తరువాత వచ్చే ఎన్నికలకు, ఇప్పుడే నా సీటుకు ఎసరు పెడుతున్నారు. వెంకటగిరికి నేనే రేపు ఎమ్మెల్యే అని ఓ పెద్దమనిషి చెప్పుకుంటున్నాడు. వీడు ఎప్పుడు ఖాళీ చేస్తాడా? కుర్చీ లాగేద్దామా అని.. కొంతమంది ఆశపడుతున్నారు’’ అని ఆనం పార్టీలో తనపై జరుగుతున్న కుట్ర గురించి ముందే చెప్పారు.

Updated Date - 2023-01-03T20:14:12+05:30 IST