TTD: టీటీడీకీ కేంద్రం మరో షాక్..!

ABN , First Publish Date - 2023-03-27T17:13:47+05:30 IST

టీటీడీ (TTD)కీ కేంద్ర ప్రభుత్వం రూ. 4.31 కోట్లు జరిమానా విధించింది. శ్రీవారికి విదేశీ భక్తులు (Foreign Devotees) ఆన్‌లైన్ ద్వారా నగదు రూపంలో కానుకలు పంపుతుంటారు.

TTD: టీటీడీకీ కేంద్రం మరో షాక్..!

ఢిల్లీ: టీటీడీ (TTD)కీ కేంద్ర ప్రభుత్వం రూ. 4.31 కోట్లు జరిమానా విధించింది. శ్రీవారికి విదేశీ భక్తులు (Foreign Devotees) ఆన్‌లైన్ ద్వారా నగదు రూపంలో కానుకలు పంపుతుంటారు. కొందరు భక్తులు తమ వివరాలు తెలుపకుండా గోప్యత పాటిస్తూ ఉంటారు. ఇలా వివరాలు వెల్లడించని వారి నుంచి సుమారు రూ. 26 కోట్లు వచ్చాయి. ఆ మొత్తాన్ని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India), టీటీడీ ఖాతాలో జమ చేయకుండా మూడేళ్లుగా పక్కన పెట్టేసింది. దీంతో సమస్యను పరిష్కరించాలని టీటీడీ కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖలను అందుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టీటీడీకి 2019 సంవత్సరానికి రూ. 1.014 కోట్లు జరిమానా విధించారు. ఈ ఏడాది మార్చి 5న కేంద్ర ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) విభాగం వార్షిక రిటర్న్‌లో హుండీలో కానుకలు వేసిన వారి చిరునామాలు లేవని టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ రాస్తూ మళ్లీ రూ. 3.19 కోట్లు జరిమానా విధించింది. అంటే మొత్తం రూ. 4.31 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. బీజేపీ (BJP)ని దుయ్యబడుతూ ఇదేనా ఓ ఆధ్యాత్మిక సంస్థతో కేంద్రం వ్యవహరించడం అంటూ ప్రశ్నించారు.

శ్రీవారికి కనకవర్షం

శ్రీవారి హుండీ ఆదాయం, వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై వడ్డీలే టీటీడీకి ప్రధాన ఆదాయవనరులుగా మారాయి. ఇటీవల టీటీడీ ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెటే ఇందుకు నిదర్శనం. రూ.4,411.68 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన టీటీడీ రూ.2,581 కోట్లు... అంటే సగం ఆదాయం హుండీ, డిపాజిట్ల ద్వారానే వస్తుందని పేర్కొంది. కొవిడ్‌ ముందువరకూ టీటీడీకి హుండీ ద్వారా ఏడాదికి రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్లు వచ్చేవి. ఇందులో భాగంగానే 2022-23 వార్షిక బడ్జెట్‌లోనూ టీటీడీ రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని పేర్కొంది. అయితే ఊహించని విధంగా గడిచిన ఏడాదిలో రూ.1,613 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. హుండీ ఆదాయం కొవిడ్‌ అనంతరం రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పెరిగింది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జనవరి 2న రూ.7.68 కోట్లు లభించాయి. ఈ క్రమంలోనే రానున్న ఏడాదికి రూ.1,591 కోట్ల హుండీ ఆదాయం సమకూరుతుందని టీటీడీ భావిస్తోంది. మరోవైపు వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ.668.51 కోట్లు ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. కొవిడ్‌ అనంతరం పెరిగిన వడ్డీ ధరలతో ఏకంగా రూ.813 కోట్లు లభించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.990 కోట్ల వడ్డీ వస్తుందని టీటీడీ అంచనా వేసింది. మరోవైపు ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.365 కోట్లు వస్తుందని గత బడ్జెట్‌లో అంచనా వేయగా, ఏకంగా రూ.500 కోట్లు లభించాయి.

Updated Date - 2023-03-27T17:27:53+05:30 IST