ఆర్‌ అండ్‌ బీలో ప్రమోషన్లు ఇప్పట్లో లేనట్టే

ABN , First Publish Date - 2023-01-06T03:40:48+05:30 IST

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణ కారణంగా అధికారులకు పదోన్నతులు ఇప్పట్లో వచ్చేలా లేవు.

ఆర్‌ అండ్‌ బీలో ప్రమోషన్లు ఇప్పట్లో లేనట్టే

కొత్త పోస్టింగ్‌లు తేలాకే పదోన్నతులు

150 పోస్టులకు నోటిఫికేషన్‌, 62 ఉద్యోగాల రద్దు

హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణ కారణంగా అధికారులకు పదోన్నతులు ఇప్పట్లో వచ్చేలా లేవు. పునర్వ్యవస్థీకరణ కారణంగా వచ్చిన కొత్త పోస్టులన్నీ దాదాపు క్షేత్రస్థాయివే. ఇప్పుడు ప్రమోషన్లు ఇస్తే పనులకు ఆటంకం కలుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో ఇటీవల టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన 150 పోస్టులు భర్తీ అయ్యేంతవరకు పదోన్నతులను ఇవ్వకూడదని నిర్ణయించారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా శాఖలో నూతనంగా 3 చీఫ్‌ ఇంజనీర్‌, 12 సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు, 13 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, 102 డి.ఈ.ఈ, 163 అసిస్టెంట్‌ ఈ.ఈ, 28 డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులతో పాటు మరికొన్ని టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టులు కలిపి మొత్తంగా 472 పోస్టులు వచ్చాయి. కొత్తగా మూడు చీఫ్‌ ఇంజనీరు కార్యాలయాలు, 10 సర్కిల్‌ ఆఫీసులు, 13 డివిజన్‌ ఆఫీసులు, 79 సబ్‌ డివిజన్‌ కార్యాలయాలు కూడా రానున్నాయి. పదోన్నతులు ఉద్యోగుల కొరత, భర్తీతో ముడిపడి ఉన్న నేపథ్యంలో కొత్తగా ఏర్పాటుకాబోతున్న కార్యాలయాలకు పూర్తిస్థాయి అధికారులు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతమున్న అధికారులనే కొత్త కార్యాలయాల్లోనూ అదనపు బాధ్యతల కింద కొనసాగించాలని శాఖ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో పదోన్నతులు వస్తాయనుకున్న వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, పునర్వ్యవస్థీకరించే క్రమంలో గతం నుంచీ ఖాళీగా ఉంటూ వస్తున్న కొన్ని పోస్టులను రద్దు చేయనున్నారు. వివిధ కేడర్‌లోని 62 పోస్టులను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్త వాటికి అవకాశం ఇవ్వాలని ఆర్థిక శాఖకు లేఖ రాయగా, అందుకు అనుమతినిస్తూ గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. రద్దైన వాటిలో సీనియర్‌ స్టెనో (లోకల్‌ కేడర్‌)10, టైపిస్ట్‌ (హెచ్‌వో)15, టైపిస్ట్‌ (లోకల్‌ కేడర్‌) 10, టెక్నీషియన్‌ (హెచ్‌వో) 2, ప్రింటింగ్‌ టెక్నీషియన్‌ (హెచ్‌వో) 1, ప్రింటింగ్‌ టెక్నీషియన్‌ (లోకల్‌ కేడర్‌) 5, వాచ్‌మెన్‌ (లోకల్‌ కేడర్‌) 15, స్వీపర్‌ (లోకల్‌ కేడర్‌) 4 పోస్టులున్నాయి.

Updated Date - 2023-01-06T03:40:50+05:30 IST