Nara Lokesh: సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ
ABN , Publish Date - Dec 30 , 2023 | 05:54 PM
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ములు చెల్లించి న్యాయం చేయాలని కోరారు. ‘‘ జగన్ గారు! మీరు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ విషయంలో మా టీడీపీ ప్రభుత్వంపైనా, నాపైనా చేసిన ఆరోపణలు, చిమ్మిన విషం మీరు మరిచిపోయుంటారు’’ అని అన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ములు చెల్లించి న్యాయం చేయాలని కోరారు. ‘‘ జగన్ గారు! మీరు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ విషయంలో మా టీడీపీ ప్రభుత్వంపైనా, నాపైనా చేసిన ఆరోపణలు, చిమ్మిన విషం మీరు మరిచిపోయుంటారు. కానీ మేము మరిచిపోలేదు. నాటి సీఎం వైఎస్ గారి పాలనలో పుట్టిన అగ్రిగోల్డ్ ఆయన హయాంలోనే స్కాం జరిగింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ ఆస్తులు 21 వేల ఎకరాలు అటాచ్ చేసి, యాజమాన్యాన్ని అరెస్టు చేయించి, బాధితులకు న్యాయం చేసింది. అయినా మాపై తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రతిపక్షనేతగా హామీలిచ్చి గద్దెనెక్కాక మీరు చేసిన మోసంతో రోడ్డునపడిన అగ్రిగోల్డ్ బాధితులు యువగళం పాదయాత్రలో నన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తామన్న సొమ్ములేవీ?’’ అని లోకేశ్ ప్రశ్నించారు.
టీడీపీ ప్రభుత్వం డిపాజిటర్లకి ఇవ్వడానికి సిద్ధం చేసిన రూ.250 కోట్లు పంపిణీ చేయకుండా అడ్డుకుని తీరా అదే సొమ్ములో రూ.14 కోట్లు తగ్గించి 22 వారాల తర్వాత రూ.236 కోట్లే పంపిణీ చేశారని మండిపడ్డారు. కొంత మొత్తమే చెల్లించి చేతులు దులుపుకున్న తీరుతో బాధితులు మరింత బాధపడ్డారని అన్నారు. మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం అని ప్రచారం చేసుకున్న వైసీపీ పాలనలో చనిపోయిన 600 మంది అగ్రిగోల్డ్ బాధితుల్లో ఏ ఒక్కరి కుటుంబానికైనా ఇస్తామన్న రూ.10 లక్షల పరిహారం ఇచ్చారా? అని నిలదీశారు. ‘కనీసం పరామర్శ చేశారా? ఇదేనా మీ మానవత్వం?’ అని అడిగారు. 2014-19 మధ్యలో బలవన్మరణాలకు పాల్పడిన 142 మంది అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు నాటి టీడీపీ ప్రభుత్వం 5 లక్షల వరకు ఎక్స్ గ్రేషియా అందించిందని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేసిన టీడీపీ ప్రభుత్వంపై చేయని ఆరోపణ లేదని గుర్తుచేశారు. తాను అగ్రిగోల్డ్ భూములు కొట్టేశానని బరితెగించి రాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం అయి ఐదేళ్లయినా అగ్రిగోల్డ్‌కి చెందిన ఒక్క సెంటు ఆస్తి అయినా ఎందుకు అటాచ్ చేయలేదని ప్రశ్నించారు.
‘‘ అగ్రిగోల్డ్ ఆస్తులపై మీరు, మీ అనుచర గణం కన్నేసి దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికీ ఇంకా మిగిలిన 10 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లకి మీరు దిగేలోగానైనా వారికి రావాల్సిన రూ.3080 కోట్లను చెల్లించి న్యాయం చేయాలని కోరుతున్నాను’’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు.