ఒక్క ఫిర్యాదుతో.. అంతా ‘బ్లాక్’!
ABN , First Publish Date - 2023-06-26T23:41:36+05:30 IST
పొందూరులోని గ్రామకంఠం సర్వేనెంబరు 163-1ను రెవెన్యూ, రిజిస్ర్టేషన్ శాఖ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- పొందూరులోని సర్వేనెంబర్ 163-1లో నిలిచిన రిజిస్ర్టేషన్లు
- 11 నెలలుగా పట్టించుకోని రెవెన్యూ శాఖ
- ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు
(పొందూరు)
పొందూరులోని గ్రామకంఠం సర్వేనెంబరు 163-1ను రెవెన్యూ, రిజిస్ర్టేషన్ శాఖ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొందూరులోని 163-1 సర్వేనెంబర్ పరిధిలో దేవదాయశాఖకు సంబంధించి 50 సెంట్ల భూమి ఉందని, దానిని పరిరక్షించుకోవాలని.. తక్షణమే రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయాలని శ్రీకాకుళం దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ 11 నెలలు కిందట రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు ఫిర్యాదు చేశారు. కానీ ఈ స్థలానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కానీ, పత్రాలు కానీ అధికారులకు సమర్పించలేదు. కాగా.. అసిస్టెంట్ కమిషనర్ ఫిర్యాదు మేరకు పట్టణంలో 64.50 ఎకరాల్లో విస్తరించి ఉన్న 163-1 (గ్రామకంఠం) మొత్తం స్థలాన్ని రెవెన్యూ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టేశారు. రిజిస్ట్రేషన్ శాఖ మొత్తం సర్వేనెంబర్‌ను 22-ఏ రిజిష్టర్‌లో చేర్చింది. దీంతో ఈ సర్వేనెంబరులో క్రయవిక్రయాలు, మార్ట్‌గేజ్ రిజిస్ర్టేషన్లు నిలిచిపోయాయి. దీంతోపాటు మరికొన్ని సర్వేనెంబర్లలో రిజిస్ట్రేషన్‌లు నిలిపేశారు. క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో పట్టణవాసులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది తమ పిల్లలకు ఇటీవల అప్పు చేసి వివాహాలు చేశారు. కళ్లముందు ఆస్తులు ఉన్నా.. విక్రయించుకోలేక నరకం అనుభవించారు. మార్ట్‌గేజ్ కాకపోవడంతో ఆస్తులను తాకట్టుపెట్టి గృహ, విద్యా రుణాలు వంటివి పొందలేకపోతున్నారు. గతంలో జరిగిన రిజిస్టర్ డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు ఉన్నా ప్రస్తుతం సర్వే నెంబర్లు బ్లాక్‌లో ఉండడం.., ఈసీ, మ్యుటేషన్‌లు జరగకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు మంజూరుకాక ఇబ్బందులు పడుతున్నారు. సర్వేనెంబర్ల బ్లాక్‌లిస్టు అంశాన్ని రిజిస్ర్టేషన్ శాఖ తమకు అనుకూలంగా మలచుకుందని పలువురు విమర్శిస్తున్నారు. సర్వే చేసి వాస్తవాలను బయటపెట్టాల్సిన రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై పలువురు కలెక్టర్‌కు గతంలో ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో మూడు నెలల కిందట టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ కలెక్టర్‌ను కలిశారు. సమస్య పరిష్కరించకపోతే పట్టణవాసులు ఉద్యమిస్తారని స్పష్టం చేశారు. దీంతో రెండు నెలల కిందట దేవదాయశాఖ చెబుతున్న స్థలాలను సర్వే చేయించారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదని పట్టణవాసులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
..................................
సమస్య పరిష్కారానికి చర్యలు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వేనెంబర్ 163-1ను బ్లాక్‌లిస్టులో పెట్టాం. దేవదాయశాఖ అధికారులు ఎటువంటి ఆధారాలు చూపకుండా ఫిర్యాదు చేశారు. ఈ సర్వేనంబరు బ్లాక్‌లిస్టులో పెట్టడంతో ఆదాయం పడిపోయింది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు.
- ఆర్. రాంబాబు, తహసీల్దార్, పొందూరు
..................................
విద్యారుణం నిలిచిపోయింది
రిజిస్ట్రేషన్, రెవెన్యూ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టిన సర్వేనంబరులో మాకు ఇల్లు ఉంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి. గతంలో దీనిపై లోను తీసుకున్నాం. దీనిని మార్ట్‌గేజ్ చేసి నా కుమారుడి చదువుకోసం రుణం తీసుకోవాలని ప్రయత్నించాం. బ్లాక్‌లిస్టులో ఉండడంతో మార్ట్‌గేజ్ కాలేదు. విద్యారుణం మంజూరు కాక.. నా కుమారుడు ఉన్నత చదువుకోసం విదేశాలకు వెళ్లడం కష్టమవుతోంది.
- జి. శ్యామ్, పొందూరు
..................................
వ్యాపార రుణం పొందలేకపోయాం
వ్యాపారం కోసం రుణం తీసుకోవాలని ప్రయత్నించాం. బ్లాక్‌లిస్టులో ఉన్న కారణంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేయలేదు. మాలాగే చాలామంది బాధితులు ఉన్నారు.
- జి. సాయిరాజ్, పొందూరు