Share News

పైపులు ఏవీ?

ABN , First Publish Date - 2023-11-20T00:06:17+05:30 IST

వైసీపీ పాలనలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘మాది రైతు ప్రభుత్వం.. రైతు సంక్షేమమే మా ధ్యేయం’ అని వైసీపీ నాయకులు తరచూ సమావేశాల్లో ప్రగల్భాలు పలుకుతున్నా.. అన్నదాతలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందని దుస్థితి నెలకొంది.

పైపులు ఏవీ?
మెళియాపుట్టిలో పొలానికి ఇంజిన్‌ ద్వారా నీరు మళ్లిస్తున్న రైతు

- నిధులు విడుదల చేయని ప్రభుత్వం

- రైతులకు తప్పని ఆర్థిక భారం

(మెళియాపుట్టి)

వైసీపీ పాలనలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘మాది రైతు ప్రభుత్వం.. రైతు సంక్షేమమే మా ధ్యేయం’ అని వైసీపీ నాయకులు తరచూ సమావేశాల్లో ప్రగల్భాలు పలుకుతున్నా.. అన్నదాతలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందని దుస్థితి నెలకొంది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా.. ప్రయోజనం కనిపించడం లేదు. ఈ ఏడాది రైతులకు అవసరమైన యంత్రాల కోసం రూ.1,100 కోట్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టినా.. కనీసం పైపులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ ద్వారా సన్నకారు రైతులకు పైపులతోపాటు ఆయిల్‌ ఇంజన్లు 50శాతం రాయితీపై అందించేవారు. వైసీపీ వచ్చిన తర్వాత రాయితీ ఊసేలేదు. ఇంజన్లు కాదు కదా.. పైపులు కూడా పంపిణీ చేయకపోవడంతో తమపై ఆర్థిక భారం తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.

- ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇప్పటికీ సాగునీటి కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పంటను కాపాడుకునేందుకు సమీప చెరువులో మోటార్ల ద్వారా పైపులు అమర్చి పొలాలకు నీరు మళ్లిస్తున్నారు. ఇందుకోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది సూక్ష్మనీటిపారుదల శాఖ ద్వారా 18 యూనిట్లకు రూ.205 కోట్లు మాత్రమే నిధులు విడుదలయ్యాయని అధికారులు చెబుతున్నారు. కానీ అవి రైతులకు పూర్తిస్థాయిలో అందే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో జాతీయ ఆహారభద్రత పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన రైతులకు రాయితీపై నీటి పైపులు ఇచ్చేవి. టీడీపీ హయాంలో నల్లపైపులకు మీటర్‌కు రూ.50, తెల్ల పైపులకు రూ.35 చొప్పున రైతులు చెల్లిస్తే.. ప్రభుత్వం గరిష్ఠంగా 300 నుంచి 450 మీటర్ల వరకు పైపులను రాయితీపై అందజేసేవారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు విడుదల చేసేవి. గతేడాదికి సంబంధించి కేంద్రం నిధులు మంజూరు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు జమ చేయలేదు. దీంతో రైతులకు ఇబ్బందులకు తప్పడం లేదు. ప్రభుత్వం స్పందించి పైపులకు సంబంధించి నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై మెళియాపుట్టి ఉద్యానశాఖ వీఏఏ దుక్క శరత్‌రెడ్డి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాటిని పరిశీలించి అర్హులకు రెండు ఇంచిల నుంచి నాలుగు ఇంచీల సైజు పైపులను పంపిణీ చేస్తామని తెలిపారు.

ఆర్థికభారం పడుతోంది

గత ప్రభుత్వం మా గ్రామంలో రైతులందరికీ నల్లపైపులు రాయితీపై అందజేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్నా పైపులు పంపిణీ చేయడం లేదు. దీంతో పైపుల కొనుగోలుకు మాపై ఆర్థిక భారం పడుతోంది.

- బింజయ్య, గడిమట్ట జగన్నాథపురం, రైతు

................

పైపుల కోసం తెలియదు

ప్రభుత్వం పైపులు ఇచ్చే పథకం ఉందని అధికారులు తెలియజేయడం లేదు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో చాలా ఇబ్బందులు పడ్డాం. పైపులు రాయితీపై అందజేస్తే ఉద్యాన పంటలైనా పండించుకుని బతుకుతాం.

- బి.మల్లేస్‌, కొల్లివలస, రైతు

Updated Date - 2023-11-20T00:06:19+05:30 IST