విశాఖ-వారణాశి రైలు ప్రారంభించాలి
ABN , First Publish Date - 2023-11-10T23:26:58+05:30 IST
ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడేలా రైల్వే శాఖ మరిన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కోరారు. శుక్రవారం భువనేశ్వర్‌లో తూర్పు కోస్తా రైల్వే జీఎం సిన్హా, ఖుర్దా రోడ్ డివిజన్ డీఆర్‌ఎమ్ హెచ్‌ఎం బజ్వా అధ్యక్షతన రైల్వే డివిజన్ సమావేశం నిర్వహించారు.
- ఖుర్దా రోడ్ డీఆర్‌ఎమ్‌కు ఎంపీ రామ్మోహన్ వినతి
- రైల్వే డివిజన్ సమావేశంలో పలు సమస్యల ప్రస్తావన
శ్రీకాకుళం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడేలా రైల్వే శాఖ మరిన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కోరారు. శుక్రవారం భువనేశ్వర్‌లో తూర్పు కోస్తా రైల్వే జీఎం సిన్హా, ఖుర్దా రోడ్ డివిజన్ డీఆర్‌ఎమ్ హెచ్‌ఎం బజ్వా అధ్యక్షతన రైల్వే డివిజన్ సమావేశం నిర్వహించారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం-వారణాశి రైలు మంజూరుపై కృతజ్ఞతలు తెలిపారు. త్వరితగతిన ఈ రైలును అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అమృత్ భారత్ పథకంలో ఎంపికైన పలాస రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ వంతెన సహా ఆర్వోబీ, తాగునీరు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక ప్రతిపాదనలు చేశారు. హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్ఛాపురంలో హాల్ట్ కల్పించాలని పదేళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని చెప్పారు. భువనేశ్వర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను రోజూ నడపాలని.. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా మీదుగా వారానికి రెండురోజులు మాత్రమే రైలు నడుస్తోందని వివరించారు. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ కోచ్‌లు, జనరల్ బోగీల సంఖ్య పెంచాలని కోరారు. విశాఖ-పలాస మెమూ రైలును ఇచ్ఛాపురం వరకూ, భువనేశ్వర్-పలాస రైలును శ్రీకాకుళం వరకు పొడిగించాలని విన్నవించారు. సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్‌ను విశాఖ-భువనేశ్వర్ మధ్య ప్రారంభించాల్సిన ప్రాధాన్యాన్ని వివరించారు. పలాస, మందస, బారువ, సోంపేట, ఇచ్ఛాపురం, జాడుపూడి రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పన, రైళ్ల హాల్టింగ్ విషయమై ప్రస్తావించారు. ఎంపీ ప్రతిపాదించిన అంశాలపై డీఆర్‌ఎమ్ సానుకూలంగా స్పందించి.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.