నిరు‘ప్రయోగ’మే!

ABN , First Publish Date - 2023-03-08T23:41:21+05:30 IST

మత్స్యకారులు, రైతుల ప్రయోజనం కోసమన్నారు. వైఎస్సార్‌ ఆక్వా ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. రెండేళ్లు గడిచి పోయాయి. వాటివల్ల ఒరిగిందేమీ లేదు. పూర్తిస్థాయి సిబ్బంది లేదు.. పరికరాలూ లేవు. దీంతో 32 పరీక్షలకు ఎనిమిదే చేస్తున్నారు. నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆక్వాల్యాబ్‌లైతే ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు. దీంతో సేవలు అందక ఆక్వా రైతులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది.

నిరు‘ప్రయోగ’మే!
శ్రీకాకుళంలో ఎప్పుడూ తాళం వేసి కనిపించే పీసీఆర్‌ ల్యాబ్‌ ఇదే

- కనీసస్థాయిలో ఉపయోగపడని వైఎస్సార్‌ ఆక్వాల్యాబ్‌

- వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఎప్పుడూ మూతే

- అట్టహాసంగా రెండేళ్ల కిందట ప్రారంభం

- నేటికీ అరకొరగానే సిబ్బంది

- సామగ్రి కొరతతో రైతులకు అందని సేవలు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

మత్స్యకారులు, రైతుల ప్రయోజనం కోసమన్నారు. వైఎస్సార్‌ ఆక్వా ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. రెండేళ్లు గడిచి పోయాయి. వాటివల్ల ఒరిగిందేమీ లేదు. పూర్తిస్థాయి సిబ్బంది లేదు.. పరికరాలూ లేవు. దీంతో 32 పరీక్షలకు ఎనిమిదే చేస్తున్నారు. నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆక్వాల్యాబ్‌లైతే ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు. దీంతో సేవలు అందక ఆక్వా రైతులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది.

.......................

మత్స్యకారులు, ఆక్వా రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ఆక్వా ల్యాబ్‌ రైతులకు కనీస స్థాయిలో ఉపయోగపడడం లేదు. రెండేళ్ల కిందట దీనిని ఆర్భాటంగా ప్రారంభించగా.. నేటికీ పూర్తిస్థాయి సిబ్బంది లేరు. మరోవైపు పరికరాల కొరత కారణంగా రైతులకు సేవలు అందడం లేదు. కేవలం కొద్దిరకాల పరీక్షలకే ఆక్వా ల్యాబ్‌ పరిమితమైందని, ఆర్భాటమే తప్ప ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 466 మంది ఆక్వా రైతులు.. 1,400 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు శ్రీకాకుళంలోని జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయంలో వైఎస్సార్‌ ఆక్వాల్యాబ్‌ను రెండేళ్ల కిందట అట్టహాసంగా ప్రారంభించారు. ఇందులో రెండు ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో చేపపిల్లల పెంపకం కేంద్రం ప్రాంగణంలో వ్యాధి నిర్ధారణ(పాలిమరీ చైన్‌ రియాక్షన్‌- పీసీఆర్‌) ప్రయోగశాల ఒకటి. నీటి, మట్టి విశ్లేషణ, మైక్రోబయాలజీ ప్రయోగశాల మరొకటి. రొయ్యలకు వ్యాధులు ప్రబలితే.. నీటిని, మట్టిని పరీక్షించి.. ఆక్వాసాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని నెలకొల్పారు. ఉప్పునీటిలో రొయ్యలు సాగు చేస్తున్న రైతులు.. మెలకువలు తెలియక నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రొయ్యలకు వాటిల్లుతున్న వ్యాధులపట్ల అవగాహన పెంచేందుకు, నీటి నాణ్యత ఎలా ఉంది?. సూక్ష్మజీవులు ఎంత శాతం ఉన్నాయి? ఏయే కారకాలు ఉన్నాయి? వైరస్‌లు సోకాయా..? ఇతరత్రా తెగుళ్లు సోకుతున్నాయా? అన్నది పరీక్షించి.. వాటికి నివారణ మార్గం సూచించేందుకు ఆక్వాల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. కానీ లక్ష్యం నీరుగారుతోంది. అలాగే నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట ప్రాంతాల్లో ఆక్వాల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఇవి ఇంకా వినియోగంలోకి రాలేదు.

32 పరీక్షలకు.. కేవలం 8 మాత్రమే

ఆక్వాల్యాబ్‌ల్లో మొత్తం 32 రకాల పరీక్షలు చేయాలి. ఇందులో నీటి విశ్లేషణ విభాగానికి సంబంధించి పీహెచ్‌, ఉష్ణోగ్రత, డీవో, ఆల్కలినిటీ, హార్డ్‌నెస్‌, టీడీఎస్‌, సీవో2, సీవోడి, లవణీయత-పీహెచ్‌, బివోడీ, సీవోడీ, అమ్మోనియా, నైట్రైట్‌, నైట్రేట్‌, ఫాస్ఫేట్‌, ఐరన్‌, హెచ్‌టూఎస్‌, క్లోరిన్‌ పరీక్షలు చేయాలి. మట్టి విశ్లేషణ పరీక్షల విభాగానికి సంబంధించి మట్టి పీహెచ్‌, మట్టిలో ఆర్గానిక్‌ కార్బన్‌, నైట్రోజన్‌, ఫాస్పేట్‌ లభ్యత, ఇతర మట్టి ఖనిజాలను పరీక్షించాలి. మైక్రోబయాలజీ విభాగంలో... టోటల్‌ ప్లేట్‌ కౌంట్‌, సూడో మోనాస్‌, ఏరో మోనస్‌, టోటల్‌ విబ్రియో కౌంట్‌, ఇ.కోలి పరీక్షలు చేయాలి. ఆర్‌టీ-పీసీఆర్‌ విభాగంలో... డబ్ల్యుఎస్‌ఎస్‌వి, ఈహెచ్‌పీ, ఐహెచ్‌హెచ్‌ఎన్‌వి, విబ్రియో స్సీసిస్‌ వంటి పరీక్షలు చేయాలి. కానీ శ్రీకాకుళంలోని ఆక్వాల్యాబ్‌లో కేవలం 8 పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. పీహెచ్‌, ఉష్ణోగ్రత, డీవో, లవణీయత-పీహెచ్‌, అమ్మోనియా, నైట్రైట్‌, నైట్రేట్‌, టోటల్‌ ప్లేట్‌ కౌంట్‌ సేవలు మాత్రమే అందుతున్నాయి.

మంజూరు చేయని సామగ్రి

పీసీఆర్‌(పాలిమరీ చైన్‌ రియాక్షన్‌) ల్యాబ్‌కు అవసరమైన సామగ్రిని ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఆక్వాసాగులో కీలకమైన తెగుళ్లను, వైరస్‌లను గుర్తించేందుకు ల్యాబ్‌లో అవసరమైన ‘స్పెక్టో ఫోటో మీటర్‌’ లేదు. ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడంతో తుది పరీక్షా ఫలితం వెలువడడంలేదు. మైక్రో బయాలజీ ల్యాబ్‌కు సంబంధించి అవసరమైన ‘లామినర్‌ ఎయిర్‌ ఫ్లో’ యంత్రం చాలా రోజుల కిందట పాడైపోయింది. మరోవైపు సిబ్బంది కొరత వెంటాడుతోంది. శ్రీకాకుళంలోని రెండు ఆక్వాల్యాబ్‌లకు ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్‌లు ఉండాలి. కానీ కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. దీంతో సక్రమంగా సేవలు అందక ఆక్వా రైతులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. అధికారులు స్పందించి.. పూర్తిస్థాయిలో ల్యాబ్‌లు వినియోగపడేలా చర్యలు చేపట్టాలని ఆక్వారైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-08T23:41:21+05:30 IST