కార్మికులకు అందని వైద్యం

ABN , First Publish Date - 2023-02-02T00:04:15+05:30 IST

ఈఎస్‌ఐ ఆస్పత్రి ద్వారా సక్రమంగా వైద్యసేవలు అందక జిల్లాలో ఎంతోమంది కార్మికులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చితికిపోతున్నారు. పరిశ్రమలు, వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి వైద్యసేవలు అందజేయడమే ‘ఈఎస్‌ఐ’ ఉద్దేశం.

కార్మికులకు అందని వైద్యం
నిర్మాణ దశలో ఉన్న పైడిభీమవరం ఈఎస్‌ఐ ఆసుపత్రి

- అరకొరగా ఈఎస్‌ఐ సేవలు

- ఆస్పత్రిని వెంటాడుతున్న సమస్యలు

- వైద్యసిబ్బంది కొరతతో రోగులకు ఇక్కట్లు

(రణస్థలం)

రణస్థలం మండలానికి చెందిన రమణ ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఈయన జ్వరం, ఒళ్లునొప్పులతో అనారోగ్యం బారినపడ్డాడు. వైద్యసేవల నిమిత్తం పైడిభీమవరంలో ఈఎస్‌ఐ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు ఈయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి మందులు రాశారు. కానీ, ఆ మందుల్లో కొన్ని అక్కడ అందుబాటులో లేవు. బయట కూడా లభ్యం కాలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో మరుసటిరోజు కుటుంబ సభ్యులు ఆయనను శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స కోసం రూ.వేలల్లో ఖర్చు పెట్టి.. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు.

.......................

...ఇలా ఈఎస్‌ఐ ఆస్పత్రి ద్వారా సక్రమంగా వైద్యసేవలు అందక జిల్లాలో ఎంతోమంది కార్మికులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చితికిపోతున్నారు. పరిశ్రమలు, వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి వైద్యసేవలు అందజేయడమే ‘ఈఎస్‌ఐ’ ఉద్దేశం. కార్మికుల పోరాట ఫలితంగా రణస్థలం మండలం పైడిభీమవరంలో 2010లో ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కానీ వైద్యులు, సిబ్బంది కొరత, అరకొర సదుపాయాలతో సమస్యలు వెంటాడుతున్నాయి. కార్మికులకు, వారి కుటుంబాలకు వైద్యసేవలు గగనమవుతున్నాయి. దీంతో చాలా మంది కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 22,800 మంది కార్మికులు ఉన్నారు. కార్మికుల వైద్యసేవల నిమిత్తం.. ఒక్కొక్కరి వేతనం నుంచి 1.75శాతంతో పాటు పరిశ్రమలు, వివిధ సంస్థల యాజమాన్యం మరో 2.45 శాతం చొప్పున నగదును ప్రతినెలా ఈఎస్‌ఐ ఆస్పత్రికి జమ చేస్తోంది. నెలకు సుమారు రూ.1.5కోట్లు ఇందుకోసం వెచ్చిస్తున్నారు. డిస్పెన్సరీ మంజూరు సమయంలో ఇచ్చిన జీవో ప్రకారం ఇద్దరు వైద్యులు, హైటెక్‌ అంబులెన్స్‌ను కేటాయించాలి. కానీ, ప్రస్తుతం ఒక వైద్యుడు, కొంతమంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. హైటెక్‌ అంబులెన్స్‌ లేదు. అత్యవసర వైద్యసేవలు అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం జిల్లాకేంద్రం, లేదా విశాఖపట్నం వెళ్లాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు.

భవన నిర్మాణం పూర్తికాక..

పైడిభీమవరం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో రోజుకు కనీసం 100 వరకు ఓపీ ఉంటుంది. పైడిభీమవం ఏపీఐఐసీకి సంబంధించిన స్థలంలో 2,276 చదరపు అడుగులను 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు కోసం కేటాయించారు. కాగా భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో మొక్కుబడిగా సేవలు అందుతున్నాయి. పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేస్తామని 13 ఏళ్ల కిందట జీవో విడుదల చేసినా.. నేటికీ ఆ దిశగా చర్యలు లేవు. భవన నిర్మాణాలు పూర్తిచేయాలని, పూర్తిస్థాయిలో వైద్యులను, సిబ్బంది నియమించాలని కార్మికులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మెరుగైన వైద్యసేవలు అందజేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

-----------

మంత్రులు పట్టించుకోవడం లేదు

జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా.. కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదు. పైడిభీమవరంలో మోడల్‌ డిస్పెన్సరీ, డయాగ్నిస్టిక్‌ సెంటర్‌, ఆరు పడకలతో పాటు బ్రాంచి ఆఫీసు ఏర్పాటుకు అనుమతిస్తూ రూ.80లక్షలు మంజూరయ్యాయి. కానీ, నేటికీ పనులు కార్యరూపం దాల్చలేదు.

-పి.తేజేశ్వరరావు, సీటూ నాయకుడు

-----------

ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి

సకాలంలో వైద్యం అందక కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పరిశ్రమల్లో చిన్న ప్రమాదం జరిగినా వైద్యం కోసం విశాఖపట్నం తీసుకెళ్లాల్సి వస్తోంది. కార్మికులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలు కల్పించాలి

-వి.సత్యంనారాయణ, కార్మికుడు

-----------

సమస్యలు పట్టడం లేదు

ప్రభుత్వానికి కార్మికుల సమస్యలు పట్టడం లేదు. పైడిభీమవరంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. ఈఎస్‌ఐ ఆసుపత్రి పక్కా భవనం పనులు పూర్తి కాలేదు. కార్మికులు రోగాల బారిన పడితే అప్పుచేసి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి దుస్థితి నెలకొంది.

- సీహెచ్‌ అమ్మన్నాయుడు, సీటూ నాయకుడు

-----------

వైద్యం అందడం లేదు

కార్మికులకు పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదు. రోజుకు 100 వరకూ ఓపీ ఉంటుంది. ఒక్క డాక్టరే ఉన్నారు. పూర్తిస్థాయిలో మందులు లేవు. చిన్నపాటి జ్వరాలు వచ్చినా ప్రైవేటు వైద్యాన్ని పొందాల్సి వస్తోంది. కార్మికుల జీతాల నుంచి నెలకు రూ.లక్షల్లో ప్రభుత్వానికి జమవుతోంది. కానీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు మాత్రం గగనమవుతున్నాయి.

- కే గురునాయుడు, కార్మికుడు

Updated Date - 2023-02-02T00:04:32+05:30 IST