Share News

శబరిమలైకి రెండు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2023-11-21T23:58:05+05:30 IST

: ఉత్తరాంధ్ర నుంచి శబరిమలైకి రెండు ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. అయ్యప్ప భక్తులు ఇరుముడితో శబరిమలేశుని దర్శించుకునేలా ప్రత్యేక రైలు ప్రారంభించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు చేసిన వినతికి రైల్వే జీఎం ఆమోదం తెలిపారు.

శబరిమలైకి రెండు ప్రత్యేక రైళ్లు

ఎంపీ రామ్మోహన్‌ వినతితో రైల్వే జీఎం ఆమోదం

శ్రీకాకుళం రోడ్‌ నుంచి ఒకటి.. విశాఖ నుంచి మరొకటి..

శ్రీకాకుళం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర నుంచి శబరిమలైకి రెండు ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. అయ్యప్ప భక్తులు ఇరుముడితో శబరిమలేశుని దర్శించుకునేలా ప్రత్యేక రైలు ప్రారంభించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు చేసిన వినతికి రైల్వే జీఎం ఆమోదం తెలిపారు. శ్రీకాకుళం రోడ్‌, విశాఖపట్నం నుంచి వేర్వేరుగా రెండు ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నట్లు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏటా వేలాది మంది భక్తులు అయ్యప్ప దీక్షలు చేపడతారని, డిమాండ్‌కు సరిపడా రైళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ పలు సందర్భాల్లో రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తూర్పుకోస్తా రైల్వే జీఎం మనోజ్‌శర్మ, ఖుర్దా రోడ్డు డీఆర్‌ఎం హెచ్‌ఎం బజ్వా, వాల్తేర్‌ డీఆర్‌ఎం సౌరభ్‌ప్రసాద్‌తో పలు దఫాలు సమావేశం అయ్యారు. దీనిపై సముఖత వ్యక్తం చేసిన రైల్వే శాఖ.. శ్రీకాకుళం రోడ్‌, విశాఖపట్నం నుంచి రెండు రైళ్లను మంజూరు చేసింది. దీంతో ఎంపీ.. జీఎం, వాల్తేర్‌ డీఆర్‌ఎంలతో ఫోన్లో మాట్లాడి కృతజ్ఞతలు తెలియజేశారు.

రైళ్ల సమయాలివే..

శ్రీకాకుళం రోడ్డు-కొల్లాం స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌(08537/08538) నవంబరు 25 నుంచి జనవరి 27 వరకు ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, సింహాచలం, దువ్వాడ(బైపాస్‌) మీదుగా ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొల్లాంలో ఆదివారం రాత్రి 7.35 గంటలకు బయలుదేరి సోమవారం రాత్రి 2 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. ఇందులో రిజిస్ట్రేషన్‌, జనరల్‌ బోగీలు సహా 22 కోచ్‌లు ఉంటాయి. విశాఖపట్నం-కొల్లాం వీక్లీ స్పెషల్‌ రైలు (08539/08540) నవంబరు 29 నుంచి జనవరి 31 వరకు ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు ప్రారంభం కానున్నది. దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి మీదుగా గురువారం మధ్యాహ్నం 12.55 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. కొల్లాంలో ప్రతి గురువారం రాత్రి 7.35 గంటలకు బయలుదేరి శుక్రవారం రాత్రి 11.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

Updated Date - 2023-11-21T23:58:07+05:30 IST