Share News

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరు దుర్మరణం

ABN , First Publish Date - 2023-11-21T23:57:11+05:30 IST

వారంతా ఓ రాజకీయ పార్టీ బహిరంగ సభకు వెళ్లేందుకు ట్రాక్టర్‌పై బయలుదేరారు. మరో గంటన్నరలో సభ వద్దకు చేరుకుంటారనుగా పెద్ద కుదుపు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది.

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరు దుర్మరణం

- 29మందికి గాయాలు

- గౌడుగురంటి సమీపంలో ఘటన

- మృతులు, క్షతగాత్రులది ఒడిశా రాష్ట్రం

మందస, నవంబరు 21: వారంతా ఓ రాజకీయ పార్టీ బహిరంగ సభకు వెళ్లేందుకు ట్రాక్టర్‌పై బయలుదేరారు. మరో గంటన్నరలో సభ వద్దకు చేరుకుంటారనుగా పెద్ద కుదుపు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. దీంతో వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 29 మంది గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి. మృతులు, క్షతగాత్రులది ఒడిశా రాష్ట్రం. పోలీసుల వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం తుంబాలో బీజేడీ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు ఆ రాష్ట్రంలోని బురత, పాత్రపురం పంచాయతీల పరిధిలోని గుడ్డిభద్ర, కుసుమాల, కుంటిగాం గ్రామాలకు చెందిన పలువురు ట్రాక్టర్‌పై మంగళవారం ఉదయం 9 గంటలకు బయలుదేరారు. అయితే, మరో గంటన్నరలో సభ వద్దకు చేరుకుంటారనుగా 11 గంటల సమయంలో మందస మండలం గౌడుగురంటి గ్రామ సమీపంలోని మలుపు వద్ద ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ఘటనలో గుడ్డిభద్రకు చెందిన సవర ఈశ్వర్‌ (55), కుసుమాలకు బుయ్య జగన్నాథ్‌(45) అక్కడికక్కడే మృతి చెందారు. కుంటిగాం గ్రామానికి చెందిన మమత కాశి, సిరిపతి బుయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు స్వల్పంగా గాయపడిన మరో 27 మందిని పలాస సీహెచ్‌సీకి చికిత్స కోసం తరలించారు. సమాచారం తెలుసుకున్న మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-11-21T23:57:12+05:30 IST