వేతనానికి హాజరుతో ముడి

ABN , First Publish Date - 2023-03-30T23:35:50+05:30 IST

అన్ని ప్రభుత్వ శాఖల అజమాయిషీతో పని ఒత్తిడితో సతమతమవుతున్న గ్రామ, వార్డు సచివాలయాలకు కొత్త సమస్య వచ్చి పడింది. బయోమెట్రిక్‌ లేదా ముఖ ఆధారిత హాజరులో ముద్ర పడిన రోజుకే వేతనం ఇవ్వాలని, లేదంటే కోత విధించాలని ఉన్నతస్థాయి నుంచి మార్గదర్శకాలు వచ్చాయి.

వేతనానికి హాజరుతో ముడి

- రోజుకు మూడుసార్లు ముద్ర వేయాల్సిందే

- సచివాలయ ఉద్యోగుల ఆందోళన

(ఇచ్ఛాపురం రూరల్‌)

అన్ని ప్రభుత్వ శాఖల అజమాయిషీతో పని ఒత్తిడితో సతమతమవుతున్న గ్రామ, వార్డు సచివాలయాలకు కొత్త సమస్య వచ్చి పడింది. బయోమెట్రిక్‌ లేదా ముఖ ఆధారిత హాజరులో ముద్ర పడిన రోజుకే వేతనం ఇవ్వాలని, లేదంటే కోత విధించాలని ఉన్నతస్థాయి నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. సాంకేతిక కారణాలతో హాజరు పడకపోయినా.. క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు వెళ్లి ముద్ర వేయడంలో నిర్లక్ష్యం చూపించినా జీతంలో కోత పడనుంది. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 732 గ్రామ, వార్డు సచివాలయాల్లో 6,640 మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వీరికి ప్రస్తుతం నెలకు రూ.29,600 వేతనం అందిస్తున్నారు. మినహాయింపులుపోను రూ.25,600 చేతికి అందుతోంది. ఇకపై సచివాలయ ఉద్యోగులు రోజులో మూడుసార్లు ఉదయం 10.30లోపు, మధ్యాహ్నం 2.30 నుంచి 3లోపు, సాయంత్రం 5గంటల తర్వాత హాజరు వేయాలి. రోజుకు రెండుసార్లు తప్పకుండా హాజరు వేయకపోతే ఆ రోజుకు సెలవుగా పరిగణిస్తారు. డీడీవోలుగా ఉన్న మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు సచివాలయ ఉద్యోగుల హాజరు సక్రమంగా నమోదైందా? లేదా? అని పరిశీలించి జీతాల బిల్లులు రూపకల్పన చేయనున్నారు. కాగా సచివాలయ ఉద్యోగుల జీతభత్యాలు హాజరుతో ముడిపెట్టడంపై చర్చ మొదలైంది. కార్యాలయాల విధులకంటే క్షేత్రస్థాయి పౌరసేవల్లోనే ఎక్కువ మంది పాల్గొంటున్నారు. ప్రస్తుతం పట్టణాలు, గ్రామాల్లో ఆస్తిపన్ను, ఇంటిపన్నుతోపాటు వివిధ రకాల పన్నులను సచివాలయ అడ్మిన్‌లు, సిబ్బంది వసూళ్లు చేస్తున్నారు. దీంతోపాటు జగనన్న ఇళ్ల నిర్మాణాలను సచివాలయాల ప్లానింగ్‌ సిబ్బంది, ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు. సచివాలయాలకు దూరంగా లేఅవుట్లు ఉన్నాయి. ఉదయం లేఅవుట్‌ వద్దకు వెళ్తే మళ్లీ సాయంత్రం వరకు రాలేని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రోజుకు మూడుసార్లు హాజరు వేయాలనే నిబంధనతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. తమకు హాజరుతో వేతనాన్ని ముడిపెట్టడం సరికాదని పేర్కొంటున్నారు. సాంకేతిక సమస్యల పరిష్కారంతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది హాజరు మినహాయింపులు ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో ఎస్‌.రామారావుని వివరణ కోరగా 90శాతం హజరు తప్పనిసరిగా ఉండాలన్నారు. 90శాతం కన్నా తక్కువ హాజరు ఉన్న ఉద్యోగులు, వలంటీర్లకు జీతంలో కోత విధించే అవకాశం ఉందని తెలిపారు.

Updated Date - 2023-03-30T23:35:50+05:30 IST