పంచాయతీల్లో దొంగలు పడ్డారు
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:10 AM
‘పంచాయతీల్లో దొంగలు పడ్డారు. రూ.8,629 కోట్లు దోచుకున్నారు’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.
- ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్
అరసవల్లి, డిసెంబరు 21: ‘పంచాయతీల్లో దొంగలు పడ్డారు. రూ.8,629 కోట్లు దోచుకున్నారు’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. గురువారం శ్రీకాకుళంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామాలభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది. 12,918 పంచాయతీలకు సంబంధించి రూ.8,629.79 కోట్లను దారి మళ్లించింది. సొంత పథకాలకు వాడుకుంది. మూడేళ్లుగా గ్రామాల్లో అభివృద్ధి పనులు లేక.. కనీస సౌకర్యాలు లేక పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. సమస్యలపై పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లంతా పోరాడినా పట్టించుకోకపోవడం దారుణం. పంచాయతీలకు కేటాయించిన నిధులను తక్షణమే జమ చేయాలి’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘వలంటీర్లు, సచివాలయాలను పంచాయతీలో విలీనం చేయాలి. సర్పంచ్, ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.15వేలకు, ఎంపీపీ, జెడ్పీటీసీలకు రూ.30వేలకు పెంచాలి. కేంద్ర నిధులను నేరుగా పంచాయతీలకే ఇవ్వాలి. గ్రామసభల తీర్మానం మేరకు సర్పంచ్‌ల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టాలి. విద్యుత్ బకాయిలు రద్దు చేయాలి. తదితర 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాల’ని ఆయన కోరారు. సమస్యలపై సర్పంచ్‌లంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షుడు ఆనెపు రామకృష్ణ, వై.వినోద్‌రాజు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు చుక్క ధనుంజయ్, సెక్రటరీ పి.వెంకట భానోజీనాయుడు, రాష్ట్ర కార్యదర్శి బోగాది అప్పలనాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కొంక్యాన ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి రుప్ప లక్ష్మీ రమణమూర్తి పాల్గొన్నారు.