వరికి మద్దతు ధర రూ.163 పెంపు
ABN , First Publish Date - 2023-06-08T00:15:02+05:30 IST
కేంద్ర ప్రభుత్వం పంటలకు సంబంధించి మద్దతు ధర ప్రకటించింది. 2023-24 ఖరీఫ్ సీజన్‌కు గాను వరికి క్వింటాకు రూ.163 పెంచినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పియూష్‌గోయల్ వెల్లడించారు. క్వింటా సాధారణ రకానికి రూ.2,183, గ్రేడ్-ఏ రకానికి రూ.2,203 ధర నిర్ణయించారు.
టెక్కలి, జూన్ 7: కేంద్ర ప్రభుత్వం పంటలకు సంబంధించి మద్దతు ధర ప్రకటించింది. 2023-24 ఖరీఫ్ సీజన్‌కు గాను వరికి క్వింటాకు రూ.163 పెంచినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పియూష్‌గోయల్ వెల్లడించారు. క్వింటా సాధారణ రకానికి రూ.2,183, గ్రేడ్-ఏ రకానికి రూ.2,203 ధర నిర్ణయించారు. గత ఏడాది సాధారణ రకం రూ.2,040, గ్రేడ్-ఏ రకం రూ.2,063 ఉండగా.. ఈసారి క్వింటాకు రూ.163 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 4,42,240 ఎకరాల్లో వరి సాగు చేస్తారు. వీటి ద్వారా 9.45 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే గత ఏడాది వరి దిగుబడులు గణనీయంగా పెరిగాయి. గత ఏడాదికి, వచ్చే ఖరీఫ్ సీజన్‌కు పెంచిన మద్దతు ధర ప్రకారం పోల్చిచూస్తే రూ.154.04 కోట్లు అదనంగా లభించనుంది.
ఈ ధర ఏమూలకు..
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, దుక్కులు తదితర వాటికి అయ్యే ఖర్చులు కలిపితే కేంద్రం పెంచిన మద్దతు ధర ఎటూ చాలదని రైతులు పెదవి విరుస్తున్నారు. క్వింటాకు రూ.500 మద్దతు ధర పెంచితే రైతాంగానికి కొంతమేరకు లబ్ధి చేకూరేదని అంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి పెసలుపై 10.4శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది పెసలు క్వింటా రూ.7,755 ఉండగా, ఈ ఏడాది రూ.8,558కి పెంచింది. వేరుశనగ క్వింటా రూ.6,377, రాగులు క్వింటా రూ.3,846, పొద్దుతిరుగుడు క్వింటా రూ.6,760, పత్తి క్వింటా రూ.7,020 చొప్పున కేంద్రం మద్దతు ధర ప్రకటించింది.