Share News

అర్హులందరికీ ఓటుహక్కు తప్పనిసరి

ABN , First Publish Date - 2023-11-17T00:03:44+05:30 IST

‘ఓటుహక్కు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అర్హులందరికీ ఓటుహక్కు తప్పనిసరిగా ఉండాల’ని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు.

అర్హులందరికీ ఓటుహక్కు తప్పనిసరి
ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్‌

- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

కలెక్టరేట్‌, నవంబరు 16: ‘ఓటుహక్కు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అర్హులందరికీ ఓటుహక్కు తప్పనిసరిగా ఉండాల’ని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. గురువారం శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ(ఆర్ట్స్‌) కళాశాల మైదానంలో నిర్వహించిన స్వీప్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనదని, అర్హులంతా ఓటు హక్కు కలిగి ఉండాలని కోరారు. ‘జిల్లా జనాభాలో 18 ఏళ్లు నిండిన యువత 46 వేల మంది ఉండగా వారిలో 18వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. మిగిలిన వారిని ఓటర్లుగా చేర్పించాలన్నదే స్వీప్‌ కార్యక్రమం లక్ష్యం. ఓటర్ల జాబితా తయారీలో అధికారులు శ్రమకోర్చి పని చేస్తున్నారు. ఓటుహక్కు వినియోగంపై మరింత అవగాహన కల్పించాలి. 18 ఏళ్లు నిండినవారంతా ఓటర్లుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబరు నెలాఖరు వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. స్వీప్‌ కార్యక్రమంలో యువత ప్రధాన పాత్ర పోషించాలి. ఓటు హక్కు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, ఆన్‌లైన్లో దరఖాస్తు విధానంపై అవగాహన కలిగి ఉండాలి’ అని సూచించారు. అనంతరం వాకర్స్‌, విద్యార్థులు కలిసి ఆర్ట్స్‌ కళాశాల నుంచి అంబేడ్కర్‌ జంక్షన్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ కలెక్టర్‌ వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ విద్యాసాగర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారి రంగయ్య, జిల్లా పౌరసంబంధాల అధికారి బాలమాన్‌ సింగ్‌, తహసీల్దార్‌ కె.వెంకటరావు, కార్పొరేషన్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు, స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ ప్రతినితులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-17T00:03:46+05:30 IST