‘మార్చి హామీ’ కూడా పాయె!

ABN , First Publish Date - 2023-03-26T00:03:50+05:30 IST

పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలకు సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వీటికి 2019 సెప్టెంబరు 6న శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో పనులు పూర్తిచేస్తామని ప్రకటించారు. కానీ నిధుల కొరత కారణంగా పనులు పూర్తికాలేదు.

‘మార్చి హామీ’ కూడా పాయె!
నిర్మాణంలో కిడ్నీ పరిశోధన కేంద్రం

- ఈనెలఖారులోపు పూర్తి చేస్తామని మంత్రి రజని హామీ

- అంతకుముందు సీఎం, ఇద్దరు మంత్రులు కూడా..

- పూర్తికాని కిడ్నీపరిశోధన కేంద్రం, 200 పడకల ఆస్పత్రి

(పలాస)

పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలకు సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వీటికి 2019 సెప్టెంబరు 6న శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో పనులు పూర్తిచేస్తామని ప్రకటించారు. కానీ నిధుల కొరత కారణంగా పనులు పూర్తికాలేదు. తర్వాత 2020 ఫిబ్రవరి 15న ముగ్గురు మంత్రులు ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్‌, సీదిరి అప్పలరాజుతో పాటు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ ప్రాంతంలో పర్యటించి.. రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు మరికొంత పనులు ముందుకు సాగాయి. తాజాగా ఈ ఏడాది జనవరి 10న ఆరోగ్యశాఖ మంత్రి వి.రజని పర్యటించారు. మార్చి నెలాఖరునాటికి వీటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గడువు సమీపిస్తున్నా పనులు పూర్తికాలేదు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పూర్తి చేయాలంటే కనీసం మరో ఏడాదైనా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో కిడ్నీరోగుల్లో నైరాశ్యం నెలకొంది.

...........................

ఉద్దానంలో కిడ్నీరోగులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 25వేల మంది రోగులు ఉన్నట్లు గుర్తించారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు.. అన్నీ ప్రాంతాల్లో పరీక్షలు చేయగా ఈ వ్యవహారం బయట పడింది. కాగా.. రోగులకు ఆశించినస్థాయిలో సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పద్మనాభపురం కాలనీ సమీపంలో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో వీటి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటికి స్వయానా.. ముఖ్యమంత్రి జగన్‌ 2019లో శంకుస్థాపన చేయగా.. నలుగురు మంత్రులు, స్పీకర్‌ కలిసి పర్యటించినా పనులు వేగవంతం కావడం లేదు. తాజాగా ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తిచేయాలని ఆరోగ్యశాఖ మంత్రి వి.రజని ఆదేశాలు జారీ చేసినా.. ఇంకా చాలావరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి పూర్తవ్వాలంటే మరో ఏడాదిపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రెండేళ్లలో భవన నిర్మాణాలు పూర్తిచేసి.. డయాలసిస్‌, పరిశోధన కేంద్రం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. అయితే నిధులు లేకపోవడంతో పనులు పునాదుల వరకే పరిమితమయ్యాయి. తర్వాత 2020లో అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, అప్పటి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి సీదిరి అప్పలరాజు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం పర్యటించారు. వీటి పనుల కోసం రూ.50కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్టు బొడ్డపాడు గ్రామంలోని బహిరంగ సభలో ప్రకటించారు. ఈ నిధులతో ఆస్పత్రికి శ్లాబ్‌ వేసి.. ప్లాస్టరింగ్‌ చేశారు. ఈ ఏడాది జనవరిలో మంత్రి రజని పర్యటించి.. మార్చి నెలాఖరులోగా పనులు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆస్పత్రి స్టెక్చర్‌ వరకు పనులు పూర్తయ్యాయి. ఫ్లోరింగ్‌, ఆసుపత్రిలో ఫర్నీచర్‌, సామగ్రి, రహదారులు, సెప్టిక్‌ ట్యాంకులు, ఆసుపత్రికి నీటి పరఫరా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో పాటుగా ఆసుపత్రి సిబ్బంది, వైద్యాధికారులు ఉండేందుకు గృహాలు, పరిశోధన కేంద్రం యూనిట్‌ నిర్మించాల్సి ఉంది. పనుల్లో జాప్యంపై ప్రజాప్రతినిధులు కానీ, కాంట్రాక్టర్లు కానీ, అధికారులు కానీ స్పష్టమైన సమాధానం చెప్పకపోవడం గమనార్హం. ఇంతవరకు వాటిపై స్పష్టత లేకపోవడంతో కేంద్రం నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

- ఇదిలా ఉండగా ఉద్దానం ప్రాంతంలో ప్రస్తుతం డయాలసిస్‌ కేంద్రాలుగా ఉన్న పలాస, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం సీహెచ్‌సీల్లో అదనంగా బెడ్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో డయాలసిస్‌ కేంద్రాలపై ఆశలు వదులుకున్నట్లేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరిశోధన కేంద్రం, 200 పడకల ఆసుపత్రి పూర్తయితే మొత్తం కిడ్నీ రోగులందరికీ ఒకే చోట డయాలసిస్‌ ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే దీన్ని విడదీసేందుకు యత్నిస్తుండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని కిడ్నీ రోగులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-26T00:03:50+05:30 IST