సొంత పార్టీ నేతలకు చుక్కెదురు
ABN , Publish Date - Dec 14 , 2023 | 11:36 PM
పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో గురువారం సీఎం పర్యటనలో వైసీపీ నాయకులకు చుక్కెదురయ్యింది. కీలక నాయకులకు పోలీసులు అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో గురువారం సీఎం పర్యటనలో వైసీపీ నాయకులకు చుక్కెదురయ్యింది. కీలక నాయకులకు పోలీసులు అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
కాశీబుగ్గ: పలాస-కాశీబుగ్గ మునిసిపల్ వైస్ చైర్మన్‌తోపాటు పలువురు వైసీపీకి చెందిన కౌన్సిలర్లు, నాయకులకు సీఎం పర్యటనలో చుక్కెదురైంది. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవానికి సీనియర్ నేతలతో పాటు వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు అనుమతించలేదు. వీఐపీ పాసులు లేవన్న షాకు చూపి వారిని పోలీసులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ నాయకులు నిరాశతో వెనుదిరిగారు.కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా అవమాన పరిచా రని వాపోయారు. దీంతో వారంతా కాశీబుగ్గ పాత బస్టాండ్ వద్దకు చేరుకు న్నారు. సభకు అన్నివిధాలా కష్టపడిన తమను పట్టించు కోకపోవడంపై ఆవేదన వ్యక్తంచే శారు. చిన్నపాటి నాయకులకు పాసులిచ్చి, తమను విస్మ రించారని వాపోయారు. రైల్వేగ్రౌండ్ సభా వేదికపైకి కొంత మంది నేతలకు అనుమతించకపోవడంపై అవమానంగా భావిస్తున్నారు. తమకు అడుగడు గునా అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీ లు కోసం రూ.లక్షలు ఖర్చుచేశామని, లోపలికి అనుమతించకుండా మాతో పాటు వైసీపీ కోసం అహర్నిశలు కష్టబడిన వార్డు నాయకులు, యువకులకు పాస్‌లు ఇవ్వకుండా సంబంధం లేని వారికి పాస్‌లిచ్చి అగౌరవ పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. సభ వద్దకు పదవుల్లో ఉన్న, పార్టీ కోసం కష్టపడిన నాయకుల సైతం లోపలికి విడిచిపెట్టకపోవడంతో వెనుదిరిగారు.
పలాస అభివృద్ధికి నిధులివ్వండి
పలాస/పలాస రూరల్/వజ్రపుకొత్తూరు: పలాస అభివృద్ధికి రూ.ఐదు కోట్లు నిధులిచ్చి ఆదుకోవాలని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సీఎం జగన్మోహన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు పలాస రైల్వే ఫుట్‌బాల్ మైదా నంలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వంశధార నీరు శివారు ప్రాంతాలకు వచ్చేందుకు ఉన్న అడ్డంకులు తొలగించాలని,టెక్కలి వద్ద గల మదనగోపాల సాగరం జలాశయంలో పూడికలు తొలగించి బైపాస్ ద్వారా నీరు విడుదలచేయాలని కోరారు. మూలపేట పోర్టుకు అనుసంధానంగా ఉన్న నౌపడ-వెంకటాపురం రహదారిని రెండులైన్లు చేసేందుకు రూ.60కోట్ల విడుదలచేయాలని, బెండిగెడ్డపై లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.7కోట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో గెలిచే అభ్యర్థులకే రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని, పలాసలో కూడా ఆ విధానాన్నే అనుసరిస్తే గెలిపించుకొని సత్తా చూపి స్తామన్నారు. కలెక్టర్ కలెక్టర్ శ్రీకేష్‌బాలాజీలాఠ్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.
నిధుల కేటాయింపు
ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం:పలాస-కాశీబుగ్గ మున్సిపల్ రోడ్డు అను సంఽధా నానికి రూ.ఐదు కోట్లు మంజూరుచేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పోర్టుకనెక్టివిటీ నౌపడ రోడ్డు కోసం రూ. 60 కోట్లు, మదనగోపాలసాగరా నికి రూ. 8కోట్లు, వజ్రపుకొత్తూరు మండలంలో బెండి ఎత్తిపోతల పథకం కోసం రూ. 7 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
సీఎం గారు.. మా మొర ఆలకించరా..
పలాస: పాతపట్నానికి చెందిన చింతాడ సిమ్మయ్య సీఎంను కలుసుకునేందుకు కాశీబుగ్గకు వచ్చాడు. సీఎం బస్సు యాత్ర జరిగే ప్రాంతంలో కుటుంబంతో కలిసి ప్లకార్డును పట్టుకొని తనకు నిధులిచ్చి ఆదుకోవాలని కోరారు. కూలీగా పని చేస్తున్న తనకు కాళ్లు విరిగిపో యాయని, వైద్యానికి రూ.రెండు లక్షలు ఖర్చవుతాయని, అంత డబ్బులు తానిచ్చుకోలేనని,ఆరోగ్యశ్రీలో కూడా దీనికి మందు లేదని చెబుతున్నారని వేడుకున్నాడు.
నాయకుల అసంతృప్తి
కంచిలి: మఖరాంపురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన తాగునీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి వచ్చిన నేపథ్యంలో కార్యక్రమానికి అవసరమైన పనులు చేసిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వద్దకు స్థానిక నాయకులను అనుమతించకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ ద్వారా ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం, అనంతరం పలాస వెళ్లిపోయారు. స్థానిక నాయకులకే కాకుండా మీడియా ప్రతినిధులకు కార్యక్రమం వద్దకు అనుమతి ఇవ్వలేదు.
మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో..
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 30వేల పైచిలుకు జనాభా, 18వేల ఓటర్లు ఉన్న తమకు జిల్లాకు వచ్చిన సీఎంతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధాకరమని బెంతొరియా సంఘ నాయకులు అనాధిదొళాయి, భాస్కర్‌దొళాయి, సత్యవతి సాహు, జయరాం సాహు ఆవేదన వ్యక్తం చేశారు.కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని, కనీసం నేటివిటీ సర్టిఫికేట్లు కూడా జారీ చేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారన్నారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశాం కల్పించాలని స్థానిక నాయకులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంతో మాట్లాడిస్తామని చెప్పి అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు.
సీఎం సభలో వామపక్షాల నిరసన
కాశీబుగ్గ: సీఎం సభలో వామపక్ష నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘సిక్కోలును కరువు జిల్లాగా ప్రకటించాలి. జీడిపంటకు గిట్టుబాటు ధర కల్పిం చాలి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలి. వంశధార కాలువను ఆధుని కీకరించి ఇచ్ఛాపురం వరకు పొడిగించాల’ని డిమాండ్ చేశారు. ‘వంశధారను ఆధునికీకరిస్తే రెండు లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. వలసల నివారణ సాధ్యమవుతుంది. 80 కేజీల జీడిబస్తాకు రూ.16వేలు చొప్పున మద్దతు ధర ప్రకటించాలి. ఆర్బీకేల ద్వారా జీడిపంట కొనుగోలు చేయాల’ని వారు కోరారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు చాపర వెంకటరమణ,ీ మోహన్‌రావు, చాపర వేణుగోపాల్, మాధవరావు, రామారావు, వాసు, శ్రీనివాస్, భాస్కరావు, భానుమతి పాల్గొన్నారు.