రెండున్నర నెలలుగా అంతే

ABN , First Publish Date - 2023-03-05T23:43:59+05:30 IST

ఎంతో చరిత్ర కలిగిన శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ(ఆర్ట్స్‌) కళాశాల ప్రతిష్ఠ మసకబారుతోంది. కొంతమంది అధ్యాపకులకు, ప్రిన్సిపాల్‌కు మధ్య అంతర్గత పోరు వివాదానికి దారి తీసింది. ఆపై బదిలీ వేటు పడగా.. నియామకాల్లో రాజకీయ జోక్యం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రెండున్నర నెలల కిందట ఇక్కడ పనిచేస్తున్న మహిళా ప్రిన్సిపాల్‌ను మరోచోటుకు బదిలీ చేశారు. పలాసలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్‌ను ఇక్కడ నియమించారు. కానీ, ఇప్పటివరకూ ఆమె బదిలీ చేసిన స్థానానికి వెళ్లలేదు. ఆయన ఇక్కడకు రాలేదు. ఈ వ్యవహారంలో కీలక ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో అధికారులు కూడా తమకెందుకులే అన్న చందాన వ్యవహరిస్తున్నారు.

రెండున్నర నెలలుగా అంతే
శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల

- శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ నియామకంపై రాజకీయ జోక్యం

- బదిలీ ఉత్తర్వులు వచ్చినా.. విధుల్లో చేరని వైనం

- అంతర్గత విభేదాలతో వరుస విచారణలు

- ఇరువర్గాలకూ కీలక ప్రజాప్రతినిధుల అండదండలు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ఎంతో చరిత్ర కలిగిన శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ(ఆర్ట్స్‌) కళాశాల ప్రతిష్ఠ మసకబారుతోంది. కొంతమంది అధ్యాపకులకు, ప్రిన్సిపాల్‌కు మధ్య అంతర్గత పోరు వివాదానికి దారి తీసింది. ఆపై బదిలీ వేటు పడగా.. నియామకాల్లో రాజకీయ జోక్యం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రెండున్నర నెలల కిందట ఇక్కడ పనిచేస్తున్న మహిళా ప్రిన్సిపాల్‌ను మరోచోటుకు బదిలీ చేశారు. పలాసలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్‌ను ఇక్కడ నియమించారు. కానీ, ఇప్పటివరకూ ఆమె బదిలీ చేసిన స్థానానికి వెళ్లలేదు. ఆయన ఇక్కడకు రాలేదు. ఈ వ్యవహారంలో కీలక ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో అధికారులు కూడా తమకెందుకులే అన్న చందాన వ్యవహరిస్తున్నారు.

‘స్పాట్‌ వాల్యూయేషన్‌’తో ఆరంభమైన వివాదం

యూనివర్శిటీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులను తప్పనిసరిగా పరీక్షా జవాబు పత్రాలను దిద్దేందుకు(స్పాట్‌ వాల్యూయేషన్‌) పంపాలి. కానీ గతంలో మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన స్పాట్‌ వాల్యూయేషన్‌కు ఈ కళాశాల నుంచి అధ్యాపకులను ప్రిన్సిపాల్‌ సురేఖ కేటాయించలేదు. ఈ క్రమంలో అంతర్గత వివాదం మొదలైంది. అలాగే ఆర్ట్స్‌ కళాశాలలో గతంలో బీఈడీ పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ సాధారణ పరిశీలనకు వచ్చారు. అప్పటి ప్రశ్నపత్రంపై చీఫ్‌ సూపరింటెండెంట్‌ సంతకంలేదన్న విషయాన్ని గుర్తించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ సురేఖపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. రాజమండ్రి నుంచి ఆర్‌జేఈడీ, విశాఖలో మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌(సీనియర్‌), డీడీ ఇలా... మూడు సార్లు ఈ విషయమై కళాశాలలోనే విచారణ చేశారు. దీనివెనుక ప్రిన్సిపాల్‌ సురేఖతో పాటు ఐదుగురి అధ్యాపకుల పాత్ర ఉందని విచారణలో నమోదు చేశారు. ఓ కుల ప్రాతిపదికన ఇలా చేస్తున్నారంటూ.. ముఖ్యంగా ఐదుగురి అధ్యాపకులను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే ప్రిన్సిపాల్‌ సురేఖను.. ఎచ్చెర్ల ట్రిపుల్‌ ఐటీ ఏవోగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఆదినారాయణరెడ్డిని ఇక్కడ నియమించారు.

హైకోర్టును ఆశ్రయించిన అధ్యాపకులు

కుల ప్రాతిపదికన తమపై బదిలీ వేటు పడిందని ఆరోపిస్తూ.. ఐదుగురు అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు పూర్వాపరాలను పరిశీలించి బదిలీ ఉత్తర్వులను, అంతకుముందు అధ్యాపకులకు జారీఅయిన చార్జిమెమోలను కొట్టివేసింది. దీంతో ఆ ఐదుగురు అధ్యాపకులు ఫిబ్రవరిలో ఆర్ట్స్‌ కళాశాలలో విధుల్లో చేరిపోయారు. ప్రిన్సిపాల్‌ సురేఖ మాత్రం బదిలీ చేసిన స్థానంలో చేరలేదు. బదిలీ ఉత్తర్వులు వెలువడి రెండున్నర నెలలైనా ఇక్కడ నుంచి రిలీవ్‌ కూడా కాలేదు. మరోవైపు ఆదినారాయణ రెడ్డి కూడా శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాలలో విధుల్లో చేరలేదు. నిబంధనల ప్రకారం ప్రిన్సిపాల్‌ సెలవు పెడితే.. ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌కు సమాచారం ఇవ్వాలి. జనవరి 10న మాత్రమే సురేఖ క్యాజువల్‌ లీవ్‌ పెట్టారు. ఇంతవరకు ఎటువంటి ప్రత్యుత్తరం కళాశాల నుంచి జరపలేదు. 21 రోజులు దాటితే.. ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు ఎవరికైనా ఇవ్వాలి. అలా కూడా జరగలేదు. బదిలీ ఉత్తర్వులు కూడా రద్దుకాలేదు. ఆమె విధుల్లోనూ చేరలేదు. దీంతో ప్రస్తుతం కళాశాలకు ప్రిన్సిపాల్‌ లేకుండా పోయారు.

ఇబ్బందుల్లో కాంట్రాక్టు అధ్యాపకులు..

రెగ్యులర్‌ అధ్యాపకుల సంగతి అలా ఉంచితే.. కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనం చెల్లించాలంటే రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌ సంతకం చేసి సిఫారసు చేయాలి. రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌ లేకపోవడంతో మూడు నెలలుగా కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు వేతనాలు చెల్లించడం లేదు. ఇదిలా ఉండగా... ఖేల్‌రత్న విభాగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.40కోట్లు ఆర్ట్స్‌ కళాశాలకు మంజూరుచేసేందుకు గాను ప్రతిపాదనలు పంపాలని కోరింది. ఇంతవరకూ కళాశాల నుంచి ప్రతిపాదనలు పంపలేదు. కళాశాలపై పూర్తి పర్యవేక్షణ లేదు. దీంతో కొంతమంది అధ్యాపకులు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరువేసి.. కొన్ని గంటలపాటు కళాశాలలో గడిపి.. వెళ్లిపోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో బోధన కూడా సక్రమంగా సాగడం లేదనే వాదన వినిపిస్తోంది. చరిత్ర కలిగిన కళాశాలకు ఈ పరిస్థితి రావడం చర్చనీయాంశమవుతోంది.

ఇరు వర్గాలకు.. కీలక ప్రజాప్రతినిధుల అండ...

కొంతమంది అధ్యాపకులకు.. బదిలీవేటు పడిన ప్రిన్సిపాల్‌కు మధ్య అంతర్గత పోరు నడిచింది. ఈ విషయంలో ఎవరికివారు కీలక ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. ఇరువర్గాలకు.. ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులు అండదండలు అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ‘‘బదిలీ ఉత్తర్వులు ఎలా ఇచ్చారు?. ఇలా చేస్తే ఎలా?’’... అంటూ ఒక కీలకప్రజాప్రతినిధి నేరుగా ఉన్నతాధికారికి ఫోన్‌లో మాట్లాడి.. బదిలీని నిలుపుదల చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయంలో తాము ఏమీచేయలేమని ఉన్నతాధికారి బదులిచ్చినట్లు తెలిసింది. అలాగే కులప్రాతిపదికన ఉత్తర్వులు ఇచ్చి.. బదిలీవేటు వేశారంటూ కోర్టును ఆశ్రయించిన అధ్యాపకులకు.. మరో కీలక ప్రజాప్రతినిధి మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇలా చేస్తే అనర్థమని భావించి వారికి అండగా ఉన్నారు. కాగా.. అంతర్గత పోరు కారణంగా కళాశాల ప్రతిష్ఠ దెబ్బతింటోందని సిబ్బంది, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-03-05T23:44:23+05:30 IST