సార్‌.. ట్యాబ్‌ పనిచేయట్లే!

ABN , First Publish Date - 2023-03-26T00:03:40+05:30 IST

ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందించిన ట్యాబ్‌ల్లో తరచూ సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ‘బైజూస్‌’తో బోధనకు అవస్థలు ఎదురవుతున్నాయి. జిల్లాలో 22,982 మంది 8వ తరగతి విద్యార్థులకు, 2,971మంది ఉపాధ్యాయులకు కలిపి 25,953 ట్యాబ్‌లు డిసెంబరులో అందజేశారు.

సార్‌.. ట్యాబ్‌ పనిచేయట్లే!

బైజూస్‌తో ఉపాధ్యాయుల అవస్థలు

కనిపించని లాంగ్వేజస్‌ పాఠాలు

కానరాని ఇంటర్‌నెట్‌ సౌకర్యం

(ఇచ్ఛాపురం రూరల్‌)

ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందించిన ట్యాబ్‌ల్లో తరచూ సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ‘బైజూస్‌’తో బోధనకు అవస్థలు ఎదురవుతున్నాయి. జిల్లాలో 22,982 మంది 8వ తరగతి విద్యార్థులకు, 2,971మంది ఉపాధ్యాయులకు కలిపి 25,953 ట్యాబ్‌లు డిసెంబరులో అందజేశారు. కాగా.. ట్యాబ్‌లు లాగిన్‌ కాకపోవడం, లాక్‌ పడిపోవడం, దానికదే ఆగిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులకు కూడా దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో ఏం చేయలేకపోతున్నారు. ప్రతి పాఠశాలలోనూ ఈ తరహా సమస్యలు రావడంతో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. వారి వద్దకు ట్యాబ్‌లు తీసుకువెళ్లి సరిచేస్తున్నారు. అలాగే పాఠశాలల్లో తెలుగు, ఆంగ్లం, హిందీ బోధించే ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్‌లు ఇచ్చారు. అయితే వారికి సంబంధించిన పాఠాలు యాప్‌లో లేవు. దీనిపై వారు ప్రశ్నిస్తే తమకు తెలియదని, నిర్ణీత గంటలు చూసి నమోదు చేయాల్సిందేనంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక వారూ తమకు సంబంధం లేని పాఠాలను చూస్తూ కూర్చుంటున్నారు. ట్యాబ్‌ల వల్ల తమకు ఇబ్బందులు పెరిగాయని, ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.

ఇంటర్‌నెట్‌ లేక..

జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేకపోవడంతో ఉపాధ్యాయుల సెల్‌ ద్వారా హాట్‌స్పాట్‌ ఓపెన్‌ చేసి బైజూస్‌ పాఠాలను బోధిస్తున్నారు. 15 నిమిషాల్లోనే ఇంటర్‌ నెట్‌ మొత్తం ఖాళీ అవుతుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. విద్యార్థులు బైజూస్‌ పాఠాలు విన్న తర్వాత, వారు ఎంతవరకు విన్నారు? ఏయే సబ్జెక్టుల్లోని పాఠాలు ఎంతమేరకు పూర్తి చేశారనే వివరాలను ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ నమోదు చేయాలి. ఈ ప్రక్రియ వల్ల బోధనకు ఆటంకం కలుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొందరు విద్యార్థులు ఇళ్లకు వెళ్లిన తర్వాత ట్యాబ్‌లను ఓ మూలన పడేస్తున్నారని, మరికొందరైతే పాఠశాలకే తీసుకురావడంలేదని, ఇంటర్‌నెట్‌ సౌకర్యం కూడా లేదని, ఈ పరిస్థితుల్లో వివరాలు ఎలా నమోదు చేయాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు అవగాహనతో పాటు ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పిస్తే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని ఉపాధ్యాయ సంఘ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఉన్నతాధికారులకు తెలియజేశాం :

చాలా పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌ సదుపాయం లేదని ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఆ పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌ ఏర్పాటు చేస్తారు. ఇంటర్‌నెట్‌ లేని చోట్ల ఉపాధ్యాయులు సెల్‌ ద్వారా హాట్‌స్పాట్‌ ఆన్‌ చేసి బోధన చేస్తున్నారు. లాంగ్వేజస్‌కు సంబంధించిన పాఠాలు కూడా త్వరలో అప్‌డేట్‌ అవుతాయి. సాంకేతిక ఇబ్బందులు కూడా పరిష్కరిస్తున్నాం.

- జి.పగడాలమ్మ, డీఈవో, శ్రీకాకుళం.

Updated Date - 2023-03-26T00:03:40+05:30 IST