‘చీకటి’ తొలగి.. వెలుగు నింపాలని..

ABN , First Publish Date - 2023-01-15T00:13:05+05:30 IST

భోగి మంటల సాక్షిగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ నేతలు శనివారం జిల్లావ్యాప్తంగా నిరసన చేపట్టారు. ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా.. ఏ విధమైనా కార్యక్రమాలు చేపట్టకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం జారీచేసిన జీవో-1ను ఇటీవల కోర్టు కొట్టివేసింది. దీంతో ఇదే విషయాన్ని ముందునుంచి చెబుతున్న టీడీపీ నేతలు.. జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.

‘చీకటి’ తొలగి.. వెలుగు నింపాలని..
నిమ్మాడలో భోగి మంట వద్ద అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌, టీడీపీ శ్రేణుల నిరసన

- భోగి మంటల్లో జీవో నెంబర్‌1 ప్రతులు దహనం

- రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా టీడీపీ నిరసనలు

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ టెక్కలి/ కోటబొమ్మాళి/ పొందూరు/ పోలాకి)

భోగి మంటల సాక్షిగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ నేతలు శనివారం జిల్లావ్యాప్తంగా నిరసన చేపట్టారు. ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా.. ఏ విధమైనా కార్యక్రమాలు చేపట్టకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం జారీచేసిన జీవో-1ను ఇటీవల కోర్టు కొట్టివేసింది. దీంతో ఇదే విషయాన్ని ముందునుంచి చెబుతున్న టీడీపీ నేతలు.. జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో కమ్ముకున్న ‘చీకటి’ తొలగిపోవాలని.. ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

- కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆధ్వర్యంలో భోగి మంట వేశారు. ఆ మంటల్లో చీకటి జీవో నెంబర్‌1 ప్రతులు, టీడీపీ నాయకులపై అక్రమ కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సైకో ముఖ్యమంత్రి పాలన కారణంగా రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బ్రిటీష్‌ కాలంలో కూడా ఇటువంటి జీవోలు రాలేదన్నారు. ధాన్యం విక్రయించినా రైతులకు బిల్లులు అందడం లేదన్నారు. సంక్రాంతి వేళ ప్రజలకు కానుకలు ఇచ్చే పరిస్థితి లేదని, ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు సక్రమంగా అందడం లేదని తెలిపారు. రాష్ట్రానికి ఈ పాలన నుంచి విముక్తి కావాలంటే చంద్రబాబునాయుడును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘సైకో పాలన పోవాలి.. సైకిల్‌ రావాలి’ అని నినాదాలు చేశారు.

- ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. చీకటి జీవోలపై ప్రతిపక్షాలు గొంతెత్తితే అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సంక్రాంతి రోజుల్లో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని.. జగన్‌ రెడ్డి ప్రభుత్వానికి ఈ పాపం ఊరికే పోదని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు దాసు నాయుడు, బాలకృష్ణ, లాయర్‌ అచ్చెన్న, అప్పిని వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- శ్రీకాకుళం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అరసవల్లిలో కార్యకర్తలతో కలసి భోగి మంటల్లో జీవో ప్రతులను దహనం చేశారు. సైకిల్‌ రావాలి.. సైకో పాలన పోవాలంటూ నినాదాలు చేశారు. శ్రీకాకుళంలో పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌...పార్టీ అనుచరులు కలసి జీఓ ప్రతులను దహనం చేశారు.

- పొందూరు మండలం పెనుబర్తిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు జీవో నెంబర్‌ 1 ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల హక్కులను కాలరాసేలా వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవో తీసుకువచ్చిందని రవికుమార్‌ ఆరోపించారు. రాక్షస పాలనకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

- పోలాకి మండలం మబగాంలో నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో జీవో ప్రతులను దహనం చేశారు. జీవో నెంబర్‌-1పై హైకోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చి.. ర్యాలీలు కొనసాగించాలని సూచించడం అభినందనీయమన్నారు.

- ఆమదాలవలసలో ఆల్‌ఇండియా లాయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహనరావు ఆధ్వర్యంలో జీవో ప్రతులను భోగి మంటల్లో వేశారు.

Updated Date - 2023-01-15T00:13:06+05:30 IST