లక్ష్యం ఘనం.. అమలు శూన్యం

ABN , First Publish Date - 2023-03-02T00:22:03+05:30 IST

డిజిటల్‌ గ్రంథాలయాల ఏర్పాటు ప్రక్రియ జాప్యమవుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజల్లో విజ్ఞాన వికాసాన్ని పెంపొందించేందుకు ఆధునిక సాంకేతికతతో పంచాయతీకి ఒక డిజిటల్‌ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.

లక్ష్యం ఘనం.. అమలు శూన్యం

- డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాల్లేవ్‌

- నిధులున్నా ముందుకు సాగని పనులు

- పట్టించుకోని ఉన్నతాధికారులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

డిజిటల్‌ గ్రంథాలయాల ఏర్పాటు ప్రక్రియ జాప్యమవుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజల్లో విజ్ఞాన వికాసాన్ని పెంపొందించేందుకు ఆధునిక సాంకేతికతతో పంచాయతీకి ఒక డిజిటల్‌ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. డిజిటల్‌ గ్రంథాలయాల్లో వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, మూడు డెస్క్‌టాప్‌ బార్‌కోడ్‌ ప్రింటర్లు, స్కానర్‌, యాంటీ వైరస్‌ సాప్ట్‌వేర్‌, అధిక నాణ్యత, శరవేగంగా పని చేసే ఇంటర్నెట్‌ నిల్వకోసం డేటా సెంటర్లు, కూర్చోడానికి కుర్చీలు, బల్లలు సమకూర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాగా వసతుల మాట అటుంచితే.. కనీసం భవన నిర్మాణాలు చేపట్టలేని స్థితిలో అధికారులు ఉన్నారు. స్థల సేకరణ చేసి భూమిపూజ పూర్తి చేసినప్పటికీ.. నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. తొలివిడతగా ఒక్కో మండలానికి ఆరు లేదా ఏడు చొప్పున.. జిల్లాకు 195 డిజిటల్‌ గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థల సేకరణ చేసి.. ఒక్కో భవన నిర్మాణం కోసం ఉపాధిహామీ పథకం కింద రూ.16లక్షలను మంజూరు చేసింది. పనుల పర్యవేక్షణ బాధ్యతను పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్‌ అధికారులకు అప్పగించింది. ఈ మేరకు వెంటనే పనులు ప్రారంభించి పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఇప్పటివరకు కేవలం 26 చోట్ల మాత్రమే పనులు ప్రారంభించారు. 131 గ్రామ పంచాయతీల్లో స్థల పరిశీలన చేశారు. ఇంకా 38 గ్రామాల్లో స్థలాల అన్వేషణ జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. డిజిటల్‌ గ్రంథాలయాలు అనగానే జిల్లావాసులు ఎంతో ఉత్సాహం చూపించారు. తీరా చూస్తే నేటికీ ప్రారంభంకాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం ఘనంగా ఉన్నా.. అమలు శూన్యమేనని నిట్టూర్చుతున్నారు. ఉన్నతాధికారులు కూడా సచివాలయ భవనాలు, ఆర్బీకేలపై సమీక్షలు చేస్తున్నారే తప్ప.. డిజిటల్‌ గ్రంథాలయాల ఏర్పాటును పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు డిజిటల్‌ గ్రంథాలయాలపై దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు. కాగా సచివాలయాలు, ఆర్బీకే, వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్‌లు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో డిజిటల్‌ గ్రంథాలయాల ప్రగతిపై పడిందని తెలుస్తోంది.

పనులు వేగవంతానికి చర్యలు :

డిజిటల్‌ గ్రంథాలయాల పనుల నిర్మాణంపై దృష్టి పెట్టాం. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలిస్తున్నాం. పనుల వేగవంతం దిశగా సమావేశాలు నిర్వహించి కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తున్నాం.

- వి.సత్యనారాయణమూర్తి, ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌శాఖ.

Updated Date - 2023-03-02T00:22:03+05:30 IST