నత్తనడకన పన్నుల వసూళ్లు

ABN , First Publish Date - 2023-03-18T23:57:48+05:30 IST

పన్నుల వసూళ్లలో మునిసిపాల్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆస్తి, నీటి పన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సిబ్బంది అలసత్వం వహిస్తున్నారు.

నత్తనడకన పన్నుల వసూళ్లు
ఇచ్ఛాపురం మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌

- మునిసిపాలిటీల్లో భారీగా బకాయిలు

- ముంచుకొస్తున్న గడువు

(ఇచ్ఛాపురం)

పన్నుల వసూళ్లలో మునిసిపాల్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆస్తి, నీటి పన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సిబ్బంది అలసత్వం వహిస్తున్నారు. ఫలితంగా లక్ష్యాల మేర పన్నులు వసూలు కావడం లేదు. విశాఖ రీజియన్‌ పరిధిలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి, నీటి పన్నులు రూ.490.60 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.328.33 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.162.30 కోట్లు బకాయి ఉంది. ఆర్థిక సంవత్సరం మరో 14 రోజుల్లో ముగియనుంది. ఈలోగా పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేయాల్సి ఉంది. దీనిపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా.. సిబ్బంది నిర్లక్ష్యంతో మందకొడిగా ప్రక్రియ సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. ఖాళీ స్థలాలు, ప్రకటనల పన్నుల వసూళ్లలో కూడా జాప్యమవుతోంది. నెలాఖరు నాటికి ఎంతమేర లక్ష్యాలు చేరుకుంటారనేది వేచిచూడాలి. దీనిపై విశాఖపట్నం రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ నాగరాజు వద్ద ప్రస్తావించగా.. పన్నులు వసూళ్లు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీచేశామన్నారు. వెనుకబడిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లకు ప్రత్యేకంగా మొండి బకాయిలపై దృష్టి సారించాలని సూచించామని తెలిపారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పన్నులు ఇలా..

====================================

మునిసిపాలిటీ అసెస్‌మెంట్స్‌ లక్ష్యం వసూళ్లు శాతం

====================================

శ్రీకాకుళం 40,561 రూ.25.66కోట్లు రూ.14.96కోట్లు 58.30శాతం

పలాస-కాశీబుగ్గ 16,606 రూ.5.06కోట్లు రూ3.00కోట్లు 59.30శాతం

ఆమదాలవలస 10,911 రూ.2.60కోట్లు రూ1.77కోట్లు 63.20శాతం

ఇచ్ఛాపురం 7,496 రూ.2.77కోట్లు రూ.1.59కోట్లు 57.50శాతం

పాలకొండ 7,323 రూ1.88కోట్లు రూ.1.25కోట్లు 66.60శాతం

రాజాం 11,622, రూ.2.55కోట్లు రూ.1.60కోట్లు 62.80శాతం

Updated Date - 2023-03-18T23:57:48+05:30 IST