మొక్కజొన్నకు కత్తెరకాటు
ABN , First Publish Date - 2023-01-15T00:09:40+05:30 IST
మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు పంజా విసురుతోంది. మొలక దశ నుంచే పురుగు ఉధృత స్థాయిలో దాడి చేస్తోంది. ఐదు రోజులకు, వారానికోసారి నివారణ మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండడం లేదు. మందు ప్రభావం తగ్గిన వెంటనే మళ్లీ విజృభింస్తోంది. ఇప్పటికే వేల ఎకరాల్లో పంట నాశనమైంది. అధికారులు మేల్కొని తక్షణమే నివారణ చర్యలు చేపట్టకపోతే మరింత ముప్పు తప్పదు.
- పంటను నాశనం చేస్తున్న పురుగు
- ఇప్పటికే 10 వేల ఎకరాలు దెబ్బతిన్న వైనం
- మేల్కోకపోతే మరింత ముప్పు
- పురుగు మందుపై రాయితీ ఎత్తేసిన ప్రభుత్వం
(జి.సిగడాం)
మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు పంజా విసురుతోంది. మొలక దశ నుంచే పురుగు ఉధృత స్థాయిలో దాడి చేస్తోంది. ఐదు రోజులకు, వారానికోసారి నివారణ మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండడం లేదు. మందు ప్రభావం తగ్గిన వెంటనే మళ్లీ విజృభింస్తోంది. ఇప్పటికే వేల ఎకరాల్లో పంట నాశనమైంది. అధికారులు మేల్కొని తక్షణమే నివారణ చర్యలు చేపట్టకపోతే మరింత ముప్పు తప్పదు. ఉమ్మడి జిల్లాలో జి.సిగడాం, సంతకవిటి, రాజాం, పొందూరు, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, ఆమదాలవలస, బూర్జ, ఎల్‌ఎన్‌పేట, మందస, టెక్కలి, సరుబుజ్జిలి, శ్రీకాకుళం, గార తదితర మండలాల్లో 60 వేల ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేస్తున్నారు. వీటిలో సుమారు 10వేల ఎకరాల్లో పంటకు కత్తెర పురుగు ఆశించింది. మొక్కదశ నుంచే పంటను నాశనం చేస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట వేసి 50 రోజులైనా పురుగు మాత్రం వదలడం లేదు. పురుగు మందులు పిచికారీ చేస్తున్నా ఫలితం ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. గత ప్రభత్వం 50శాతం రాయితీపై పురుగు మందును సరఫరా చేసేదని, వైసీపీ ప్రభుత్వం ఆ రాయితీని ఎత్తేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బయట మార్కెట్‌లో పురుగు మందును అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని, కత్తెర పురుగు ఆశించడంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
అప్రమత్తతే ముఖ్యం
మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు అప్రమత్తతే ముఖ్యం. ఫాల్ ఆర్మీవార్‌గా పిలిచే కత్తెర పురుగు జీవితకాలం వేసవిలో 30 రోజులు, మిగతా కాలంలో 60 రోజులు. ఇది ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వేగంగా విస్తరిస్తుంది. సుమారు 1,500 గుడ్లు పెడుతుంది. పగలు కంటే రాత్రి సమయంలో ఒక చోట నుంచి వేరే చోటకు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. వీటిని నాశనం చేసేందుకు సరైన జాగ్రత్తలు పాటించాలి. లేదంటే పురుగు ఉధృతి పెరిగి పంట నాశనమవుతుందని వ్యవసాయ శాఖ నిపుణులు చెబుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
కత్తెర పురుగు నివారణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మొక్క వేసిన వారం నుంచి పది రోజుల్లోపు ఎకరానికి అరలీటరు వేపనూనెను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 15 నుంచి 20 రోజుల మధ్యలో ప్రోపెనోపాస్ 250 మి.లీ, ఒక లీటరు వేపనూనెను 200 లీటర్ల నీటిలో కలిపి స్ర్పే చేయాలి. 20 నుంచి 30 రోజుల మధ్యలో ఎకరానికి ఇమామెక్టిన్ బెంజెయట్ 100 గ్రాములు, లీటరు వేపనూనెను 12 ట్యాంకుల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 35 నుంచి 45 రోజుల మధ్యలో పురుగు తగ్గుముఖం పట్టకపోతే కొరజన్ 60మి.లీ, వేపనూనె లీటర్, స్టైన్‌టారం 100 మి.లీ, నీటితో కలిపి స్ర్పే చేయాలి.
-ఎ.శారద, వ్యవసాయశాఖ అధికారిణి, జి.సిగడాం