రిమ్స్ వైద్య విద్యార్థుల కొట్లాట
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:30 AM
రిమ్స్ వైద్య విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి హాస్టల్‌లో రెండు గ్రూపులుగా విడిపోయి ట్యూబ్ లైట్లతో దాడి చేసుకున్నారు.
- వసతి గృహంలో రెండు వర్గాలుగా విడిపోయి..
- ట్యూబ్ లైట్లతో దాడులు చేసుకున్న వైనం
- ముగ్గురికి గాయాలు
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 30: రిమ్స్ వైద్య విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి హాస్టల్‌లో రెండు గ్రూపులుగా విడిపోయి ట్యూబ్ లైట్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఇతర రాష్ట్రానికి చెందిన కొందరు విద్యార్థులు రిమ్స్ ఆస్పత్రి వెనుక ఉన్న హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకుంటున్నారు. ప్రతీ రోజులానే శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లిన కొందరు విద్యార్థులు అక్కడే రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. హాస్టల్‌కు వచ్చి ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో హాస్టల్ వార్డెన్‌లు వారించడం, కళాశాలకు ఫిర్యాదు అందుతుందన్న భయంతో విద్యార్థులు తగ్గారు. అయితే, శుక్రవారం రాత్రి కొంతమంది విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వెళ్లి అర్ధ రాత్రి హాస్టల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం జరిగిన వివా దంపై హాస్టల్ థర్డ్ ఫ్లోర్‌లో రూమ్ నెంబర్ 81, 84లో ఉన్న 8 మంది వైద్య విద్యార్థులు ఆరుగురు ఒక గ్రూప్‌గా, మరో ఇద్దరు ఒక గ్రూప్‌గా విడిపోయి అర్ధరాత్రి ఒంటి గంట నుంచి శనివారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు కొట్టుకున్నారు. హా స్టల్‌లో ఉన్న పాడైపోయిన ట్యూబ్‌లైట్లతో తలలు, శరీరంపై బాదుకున్నారు. ఈ ఘటనలో శశి సింగ్ అనే విద్యార్థి ముక్కు పగిలి పోగా, మరో ఇద్దరికి రక్తపు గాయాలయ్యాయి. ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ ఈశ్వరరావు కళాశాల ప్రిన్సిపాల్ రవి వెంకటాచలం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కొట్లాటకు దిగిన నరేంద్ర కశ్యప్, ముఖేష్, అమిత్, శశి సింగ్, రవి, దేవేంద్ర, యువరాజ్, నిషాంత్‌ను ప్రిన్సిపాల్ తన కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ఘటనపై కళాశాల కమిటీ సమక్షంలో విద్యార్థులను ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించారు. విద్యార్థులతో క్షమాపణ పత్రం రాయించారు. పరీక్షల నేపథ్యంలో విచారణ అనంతరం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ వెంకటాచలం మీడియాకు వివరణ ఇచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. దాన్ని మరువక ముందే ఈ ఘటన జరిగింది. దీంతో రిమ్స్ వసతి గృహంలో భద్రత డొల్లతనం మరోసారి బహిర్గతమయ్యింది.