డ్రోన్లకూ.. ని‘బంధనాలు’

ABN , First Publish Date - 2023-08-22T00:07:22+05:30 IST

ప్రభుత్వం రాయితీపై డ్రోన్లను అందజేస్తామన్నా.. రైతులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. పంటలకు పురుగు మందుల పిచికారీ చేసేందుకు రైతులు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది.

డ్రోన్లకూ.. ని‘బంధనాలు’
వ్యవసాయశాఖ అందించనున్న డ్రోన్‌

- ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఎగరడం అనుమానమే

- మారిన నిబంధనలతో ముందుకురాని రైతులు

- గ్రూపులో ఒకరికి పాస్‌పోర్టు కచ్చితంగా ఉండాలంట

- రూ.10లక్షల వ్యయంలో ప్రభుత్వం ఇచ్చేది రూ.4లక్షలే

(ఇచ్ఛాపురం రూరల్‌)

ప్రభుత్వం రాయితీపై డ్రోన్లను అందజేస్తామన్నా.. రైతులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. పంటలకు పురుగు మందుల పిచికారీ చేసేందుకు రైతులు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. ఇది రైతుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంతో పాటు కూలీల కొరతను అధిగమించాలనే ఉద్దేశంతో రైతులకు రాయితీపై డ్రోన్లను అందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. డ్రోన్ల వల్ల అతితక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సరైన విధానంలో పంటకు సరిపడేలా పిచికారీ చేయవచ్చు. సాధారణ విధానంతో పోలిస్తే డ్రోన్‌తో పిచికారీ వల్ల సమయం వృథా తగ్గి 30 శాతం పురుగుల మందు ఆదా అవుతుంది. కాగా.. అధికారుల లక్ష్యం బాగున్నా.. ప్రభుత్వ నిబంధనలు రైతులకు ప్రతిబంధకాలుగా మారడంతో డ్రోన్లను తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. డ్రోన్ల విలువ రూ.10 లక్షలు వరకు ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులు ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించే పరిస్థితి లేదు. దీంతో రైతులను గ్రూపులుగా చేసి వారికి అందించాలని నిర్ణయించారు. డ్రోన్‌ ధర రూ.10లక్షలు కాగా, అందులో ప్రభుత్వం రూ.4 లక్షలు రాయితీ ఇస్తుంది. మిగిలిన రూ. 6 లక్షల్లో రూ. లక్ష రైతు భరించాలి. మిగతా రూ. 5 లక్షలు బ్యాంకు నుంచి రుణం పొందేలా అధికారులు విధివిధానాలు తయారు చేశారు. డ్రోన్‌ నిర్వహణకు తొలుత డిప్లొమా, ఇంజనీరింగ్‌ విద్య అర్హత నిర్ణయించారు. గ్రామాల్లో రైతులకు అంత విద్యార్హత లేకపోవడంతో మళ్లీ పదోతరగతి, ఇంటర్‌గా మార్చారు. విద్యార్హతతోపాటు గ్రూపులో ఒకరికి పాస్‌పోర్ట్‌ విధిగా ఉండాలన్న నిబంధన పెద్ద సమస్యగా మారిందని.. అందుకే రైతులు ముందుకురావడంలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

శిక్షణకు 15 మంది రైతులు మాత్రమే

తొలి విడతలో ప్రతి మండలానికి మూడు చొప్పున పురుగు మందులను పిచికారీ చేసే డ్రోన్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతు గ్రూపుల్లో ఈ డ్రోన్‌ వినియోగించే నైపుణ్యంపై ఒకరికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాయలంలో ఇటీవల 12 రోజులపాటు జరిగిన ఈ శిక్షణకు జిల్లా నుంచి కేవలం 15 మంది రైతులు మాత్రమే హాజరయ్యారు. ఈ శిక్షణలో విద్యుత్‌ తీగలు, చెట్లు తప్పించే నిర్వహణ రిమోట్‌ సెన్సింగ్‌ అంశాలను పరీక్షించి విమానయాన విభాగం వారు అర్హత ధృవపత్రం అందజేస్తారు. భారత ప్రభుత్వం వాయుసేన నిబంధన ప్రకారం ఈ డ్రోన్‌ వినియోగించే వారికి తప్పనిసరిగా పాస్‌పోర్టు ఉండాలి. అందుకు వ్యవసాయ సాగులో వినియోగించే డ్రోన్‌కు కూడా ఆ నిబంధన అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్రోన్‌ మంజూరు కావాలంటే ఈ ధ్రువపత్రం, మెడికల్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలి.

లక్ష్యాలు సాధిస్తాం

ఈ ఖరీఫ్‌లో డ్రోన్‌ వినియోగానికి కృషి చేస్తున్నాం. ఇప్పటికే 15 మందికి శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలు కూడా అందజేశాం. వచ్చే నెలలో అనుమతి పొందిన కంపెనీలపై రుణాలు అందజేస్తాం. ఆయా కంపెనీ డ్రోన్‌లతో 20 గంటల పాటు డెమో నిర్వహించి వారికి నచ్చిన కంపెనీ డ్రోన్‌ను అందజేస్తాం. మరి కొంత మంది రైతులను ఎంపిక చేసి శిక్షణకు పంపి లక్ష్యాలను సాధిస్తాం.

- శ్రీధర్‌, జేడీ వ్యవసాయశాఖ, శ్రీకాకుళం

Updated Date - 2023-08-22T00:07:22+05:30 IST