బస్తాపై రూ.వెయ్యి తగ్గించి..

ABN , First Publish Date - 2023-05-26T23:59:11+05:30 IST

వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి జీడి రైతులను దోచుకుంటున్నారు. గతేడాది కంటే వెయ్యి రూపాయలకు తక్కువగా జీడిపిక్కల బస్తాను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

బస్తాపై రూ.వెయ్యి తగ్గించి..

- జీడి పిక్కల కొనుగోలు

- వ్యాపారుల సిండికేట్‌

- నష్టపోతున్న రైతులు

(వజ్రపుకొత్తూరు)

వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి జీడి రైతులను దోచుకుంటున్నారు. గతేడాది కంటే వెయ్యి రూపాయలకు తక్కువగా జీడిపిక్కల బస్తాను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో జీడిపంట అధికంగా పండుతుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో సుమారు 50 వేల బస్తాలు ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పిక్కలను పలాస ప్రాంత వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. అయితే, గత ఏడాది 80 కిలోల జీడిపిక్కల బస్తా రూ.9వేలు ఉండగా, ఈ ఏడాది రూ.8వేలు కంటే తక్కువకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2018లో రూ.14వేలు ఉన్న బస్తా ధర ఇప్పుడు రూ.8 వేలకు పడిపోయింది. వ్యాపారులే సిండికే టుగా తయారై పథకం ప్రకారం ఏటా ధరలను తగ్గించుకుంటూ వస్తున్నట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతుల నుంచి పిక్కలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, వాటిని పప్పుగా మార్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పిక్కలు ధరలు తక్కువగా ఉండడంతో ఒకపక్క వాటిని అమ్ముకోలేక, మరోపక్క భద్రపరచుకోలేక రైతులు నానాయాతన పడుతున్నారు. ఎరువులు, క్రిమి సంహా రక మందులు, కూలీల ధరలు భారీగా పెరిగిపోయాయని, ఇప్పుడు రూ.8వేలకు పిక్కలను విక్రయిస్తే నష్టపోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. వ్యాపారులు కనీస ధరకు పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

మద్దతు ధర కల్పించాలి

జీడి రైతుల బాధలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి జీడి పిక్కల బస్తాకు రూ.15వేలు మద్దతు ధర ప్రకటించాలి. అప్పుడే రైతులకు లాభం చేకూరుతుంది. లేదంటే నష్టాలు తప్పవు.

- సూరాడ మోహనరావు, టీడీపీ మండల అధ్యక్షుడు, అక్కుపల్లి

..........................

నష్టపోతున్నాం

80 కిలోల జీడిపిక్కల బస్తాను వ్యాపారులు రూ.8వేలకే కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల నష్టపోతున్నాం. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఏటా జీడిపిక్కల ధరలను తగ్గిస్తున్నారు. రైతులు అప్పు చేసి పంటను సాగు చేశారు. ఇప్పుడు ఈ ధరలకు పిక్కలను అమ్ముకోలేక, ఇంటిలో దాచుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించాలి.

- జోగి తిరుపతిరావు, రైతు, గుణుపల్లి

Updated Date - 2023-05-26T23:59:11+05:30 IST