వర్షపు నీటిలో రైల్వే అండర్‌పాస్‌లు
ABN , First Publish Date - 2023-03-25T23:50:51+05:30 IST
జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైల్వే అండర్‌పాస్‌ల వద్ద భారీగా వర్షపునీరు నిలిచిపోయి ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.
- చర్యలు తీసుకోవాలని డీఆర్‌ఎంకు ఎంపీ లేఖ
శ్రీకాకుళం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైల్వే అండర్‌పాస్‌ల వద్ద భారీగా వర్షపునీరు నిలిచిపోయి ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. అండర్‌పాస్‌ల వద్ద నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రైల్వే డీఆర్‌ఎంకు ఎంపీ శనివారం లేఖ రాశారు. ఆమదాలవలస-దూసి రైల్వే స్టేషన్ల మధ్యలో పెనుబర్తి, తాడివలస, చినబొడ్డేపల్లి గ్రామాల వద్ద ఇటీవల రైల్వేశాఖ అండర్‌పాస్‌లను నిర్మించింది. అయితే, వర్షాలకు అండర్‌పాస్‌ల వద్ద నీరు భారీగా నిలిచిపోయి ప్రజలు, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని స్థానికులు ఎమ్పీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎంపీ స్పందించారు. అండర్ పాస్‌ల వద్ద నీరు నిల్వ లేకుండా బయటకు పంపేందుకుగాను అవుట్‌లెట్ చానెల్స్‌ను నిర్మించాలని రైల్వే డీఆర్‌ఎంకు లేఖ రాశారు. ఈ లేఖపై డీఆర్‌ఎం స్పందిస్తూ.. ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశించామని, త్వరలో చర్యలు తీసుకుంటామని వివరించారు.