ఏబీ రోడ్డులో గుంత.. ఇరుక్కున్న ఇసుక లారీలు

ABN , First Publish Date - 2023-09-22T23:41:57+05:30 IST

అలికాం-బత్తిలి (ఏబీ) రోడ్డులో ఏర్పడ్డ పెద్ద గుంతలో రెండు ఇసుక లారీలు ఇరుక్కున్నాయి. దీంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

ఏబీ రోడ్డులో గుంత.. ఇరుక్కున్న ఇసుక లారీలు
లారీలను బయటకు తీస్తున్న దృశ్యం

సరుబుజ్జిలి, సెప్టెంబరు 22: అలికాం-బత్తిలి (ఏబీ) రోడ్డులో ఏర్పడ్డ పెద్ద గుంతలో రెండు ఇసుక లారీలు ఇరుక్కున్నాయి. దీంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్‌కు సమీపంలో రోడ్డుపై కాలువను తలపించే గుంత ఏర్పడింది. గురువారం అర్థరాత్రి సమయంలో ఇసుక లోడులతో వెళ్తున్న లారీలు ఈ గుంతలో ఇరుకున్నాయి. దీంతో కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ కృష్ణ ప్రసాద్‌, సిబ్బందితో చేరుకుని వాహనాలను దారి మళ్లించారు. శుక్రవారం తెల్లవా రు జామున ప్రొక్లైనర్‌, జేసీబీ సాయంతో లారీలను గుంత నుంచి బయటకి తీయించారు. కాగా ఇక్కడ ఏర్పడిన గుంతపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కాలువ కాదు రోడ్డు అనే శీర్షికతో వార్త ప్రచురితమైనా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించు కోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదిలావుంటే అర్థరాత్రి ఇసుక రవాణా పై అక్కడికి చేరుకున్న ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-22T23:41:57+05:30 IST