ఓపీఎస్‌ను అమలు చేయాల్సిందే

ABN , First Publish Date - 2023-09-26T00:04:13+05:30 IST

జీపీఎస్‌ను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం తగదని, తక్షణమే దీన్ని వెనక్కు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య డిమాండ్‌ చేసింది. సీపీఎస్‌కు బదులు ఓపీఎస్‌ను అమలు చేయాల్సిందేనని, వేరేదీ ఆమోదించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

ఓపీఎస్‌ను అమలు చేయాల్సిందే
కలెక్టరేట్‌ వద్ధ ధర్నా చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

- జీపీఎస్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలి

- ఉపాధ్యాయ సంఘాల ధర్నా

అరసవల్లి, సెప్టెంబరు 25: జీపీఎస్‌ను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం తగదని, తక్షణమే దీన్ని వెనక్కు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య డిమాండ్‌ చేసింది. సీపీఎస్‌కు బదులు ఓపీఎస్‌ను అమలు చేయాల్సిందేనని, వేరేదీ ఆమోదించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఫ్యాప్టో, ఏపీసీపీఎస్‌ఈఏ ఆధ్వర్వంలో సోమవారం చలో కలెక్టరేట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయకుండా జీపీఎస్‌ పేరుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో ఉండాలనుకుంటే ఓపీఎస్‌ను అమలు చేయాల్సిందేనన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని తప్ప వేరేదీ ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జీపీఎస్‌ అనేది పేరును మార్చి అంకెల గారడీ చేయడమే తప్ప మరేమీ లేదన్నారు. పాత పెన్షన్‌ను పునరుద్ధరించే వరకూ పోరాడుతామని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై ఈ రకమైన విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ మజ్జి మదన్‌మో హన్‌, నాయకులు కొమ్ము అప్పలరాజు, కొప్పుల భానుమూర్తి, చౌదరి రవీంద్ర, పొందూరు అప్పారావు, ఎస్‌.కిషోర్‌కుమార్‌, పేడాడ ప్రభాకరరావు, పడాల తమ్మినాయుడు, ఏపీసీపీఎస్‌ఈవో అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావు, ప్రదాన కార్యదర్శి రెడ్డి సూరిబాబు, మాజీ ఉపాధ్యక్షుడు బి.బాలకృష్ణ, వీవీ రాజు, గౌరవాధ్యక్షుడు బి.రాజు, రాష్ట్ర కౌన్సెలర్‌ మెండ రామారావు, నగర అధ్యక్షుడు వి.శరత్‌, నాయకులు పిసిని వసంతరావు, కొప్పల డేనియల్‌, తాతారావు, తంగి మురళి, వాన కామేశ్వరరావు, కోత ధర్మారావు, టి.చలపతిరావు, రమణమూర్తి, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:04:13+05:30 IST