ఒక్కరే.. బాధ్యతలు బోలెడు
ABN , First Publish Date - 2023-03-05T23:39:14+05:30 IST
విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక బోధన కుంటుపడుతోంది. చాలా పాఠశాలల్లో ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఉండగా.. వారికి బోధనేతర పనులతోనే సరిపోతోంది.
- ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సక్రమంగా సాగని బోధన
(ఇచ్ఛాపురం రూరల్)
విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక బోధన కుంటుపడుతోంది. చాలా పాఠశాలల్లో ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఉండగా.. వారికి బోధనేతర పనులతోనే సరిపోతోంది. ఇది విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో 1,786 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. అందులో 662చోట్ల ఏకోపాధ్యాయుడే ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 20 మంది విద్యార్థులు ఉంటే.. ముగ్గురు ఉపాధ్యాయులతో బోధన చేపట్టాలి. ఆ తర్వాత ప్రతి 30 మందికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున అవసరం. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉంది. దీన్ని పని సర్దుబాటు విధానంతో నెట్టుకొస్తున్నారు. బదిలీల ప్రక్రియ జరగనందున ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీలు భర్తీ కావడం లేదు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధన కన్నా.. యాప్‌ల్లో సమాచారం అప్‌లోడ్ చేయడం, ఇతరత్రా పనులతోనే రోజు గడిచిపోతోంది. ఉపాధ్యాయులు ఉదయాన్నే పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. విద్యార్థుల హాజరు వివరాలను ఉదయం 10 గంటలలోపు ఇవ్వకపోతే ఆ ప్రభావం మధ్యాహ్న భోజన పథకంపై పడుతుంది. ఒకవేళ ‘నాడు-నేడు’ కార్యక్రమంలో పనులు చేపడితే.. వాటిని పర్యవేక్షించాలి. పనుల వివరాలను అప్‌లోడ్ చేయాలి. సచివాలయ సిబ్బంది పర్యవేక్షించి సీఆర్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ యాప్ సాంకేతిక సమస్యతో ఉపాధ్యాయులకు అదనపు భారం పడుతోంది. రాష్ట్రస్థాయి యాప్‌లకు తోడు జిల్లాస్థాయిలో మరికొన్ని యాప్‌ల్లో వివరాలు అప్‌లోడ్ చేయాలి. ఈ నేపథ్యంలో బోధన సక్రమంగా సాగడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరు ఉపాధ్యాయులుండాలి :
ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలి. ఎవరైనా ఒకరు సెలవు పెడితే ఉన్న ఉపాధ్యాయుడు మిగతా పనులు చేసుకోవచ్చు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెడితే పక్క పాఠశాల నుంచి డిప్యూటేషన్ వేస్తున్నారు. దగ్గరలో ఇద్దరు అంతకన్నా ఎక్కువ ఉపాధ్యాయులు పని చేస్తున్న పాఠశాల లేకుంటే ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
- ఆర్‌వీ అనంతాచార్యులు, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.
...........
ప్రత్యామ్నాయం లేదు :
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పిల్లలు హాజరు, మధ్యాహ్న భోజన పథకం వివరాలు నమోదు, మరుగుదొడ్లు పరిశుభ్రత బాధ్యతలతోపాటు అన్ని తరగతులకు బోధన ఒక్కరే చేయాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో సెలవు తీసుకోవాలంటే ప్రత్యామ్నాయం లేదు. అన్ని పాఠశాలల్లో ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు ఉంటే ఇబ్బంది ఉండదు.
- బి.శంకరం, ఆపస్ మండల అధ్యక్షుడు, ఇచ్ఛాపురం
..............
బోధనకు ఇబ్బంది కలగనీయం :
ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగనీయకుండా చర్యలు చేపడుతున్నాం. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎవరైనా సెలవు పెడితే తాత్కాలికంగా సర్దుబాటు చేసేలా ఎంఈవోలకు ఆదేశాలిచ్చాం.
- జి.పగడాలమ్మ, డీఈవో, శ్రీకాకుళం.