Share News

ఆగని పోరుబాట

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:02 AM

సమస్యల పరిష్కారం కోరుతూ.. అంగన్‌వాడీల పోరుబాట కొనసాగుతూనే ఉంది. గురువారం కూడా జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

ఆగని పోరుబాట
శ్రీకాకుళంలో అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన

- కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

- కేంద్రాల తాళాలు పగులగొట్టినవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు

అరసవల్లి/కొత్తూరు, డిశంబరు 21: సమస్యల పరిష్కారం కోరుతూ.. అంగన్‌వాడీల పోరుబాట కొనసాగుతూనే ఉంది. గురువారం కూడా జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులకొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె.కల్యాణి, కార్యకర్తలు మూకుమ్మడి శ్రీకాకుళంలోని ఒకటో, రెండో పట్టణ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అర్బన్‌ ప్రాజెక్టు గౌరవాధ్యక్షురాలు టి.రాజేశ్వరి, కె.ప్రమీలాదేవి, డి.ఇందుమతి, సీహెచ్‌ అరుణ, బి.సరస్వతీదేవి, అప్పలనరసమ్మ, స్రవంతి, మల్లేశ్వరి, పుష్పలత, సంధ్యారాణి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రెడ్డిశాంతి కాన్వాయ్‌ను అడ్డగింత

పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కాన్వాయ్‌ను అంగన్‌వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొత్తూరులో సీఎం జగన్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రెడ్డి శాంతి వచ్చారు. ఆమె తిరుగు వెళ్తున్న సమయంలో కాన్వాయ్‌ను అంగన్‌వాడీ కార్యకర్తలు అడ్డుకుని.. సమస్యలపై నిలదీశారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను మరచిపోయారని, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాడిస్ట్‌ పాలన అంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపటి తర్వాత ఎమ్మెల్యే రెడ్డి శాంతి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Dec 22 , 2023 | 12:02 AM