మరోసారి.. కబ్జా!
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:01 AM
నరసన్నపేటలో జిల్లాపరిషత్‌కు సంబంధించి బోర్డు బంగ్లాకు చెందిన స్థలాన్ని మళ్లీ ఆక్రమించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు.
- బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణకు వైసీపీ శ్రేణుల యత్నం
- ప్రహరీ కూల్చేసి.. ప్రభుత్వ బోర్డు తొలగించిన వైనం
- అక్రమాలను అడ్డుకున్న అధికారులు
నరసన్నపేట, డిసెంబరు 16: నరసన్నపేటలో జిల్లాపరిషత్‌కు సంబంధించి బోర్డు బంగ్లాకు చెందిన స్థలాన్ని మళ్లీ ఆక్రమించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. ఆమదాలవలసకు చెందిన వైసీపీ నేతలు.. శనివారం స్థానిక నాయకులతో కలిసి గోడను పగులగొట్టి అక్రమ నిర్మాణానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకుని పంచాయతీరాజ్ శాఖ అధికారులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నరసన్నపేట పంచాయతీ కార్యాలయం ఎదురుగా జిల్లాపరిషత్‌కు సంబంధించి బోర్డుబంగ్లాకు చెందిన కోట్లాది రూపాయల విలువైన స్థలం ఉంది. ఈ స్థలంలో కొంతమంది 2008లో అక్రమ నిర్మాణాలు చేపట్టగా.. స్థానికులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. దీంతో ఈస్థలంపై ఎవరూ కన్నెత్తి చూడలేదు. ఇటీవల ఆమదాలవలస మండలానికి చెందిన ఒక ఆసామి.. బోర్డు బంగ్లాకు చెందిన ఈ స్థలంలో కొంత భాగాన్ని కొనుగోలు చేసినట్టు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించాడు. వాటిద్వారా గతంలో నరసన్నపేటలో పనిచేసిన ఒక రెవెన్యూ అధికారితో మిలాఖత్ అయి సంబంధిత స్థలంపై హక్కుపత్రాలు పొందినట్టు సమాచారం. ఆ ఆసామి ఈ హక్కు పత్రాలతోనే సుడా అధికారుల నుంచి అనుమతి తీసుకుని.. ఈ ఏడాది అక్టోబరు 21న నిర్మాణాలు చేసేందుకు ఉపక్రమించాడు. అప్పట్లో పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి.. ప్రభుత్వ స్థలంగా బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. అయితే అదే ఆసామి మళ్లీ ఈ స్థలం ఆక్రమణకు యత్నించాడు. శనివారం బొరిగివలసకు చెందిన వైసీపీ మద్దతుదారులతో కలిసి ప్రహరీని కూల్చేశాడు. ప్రభుత్వ బోర్డులు తొలగించి అక్రమ నిర్మాణాలకు ఉపక్రమించాడు. దీంతో స్థానికులు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు పోలీసుల సహాయంతో ఆక్రమణలను అడ్డుకున్నారు. సంబంధిత స్థలంపై తనకు పూర్తిహక్కులు ఉన్నాయని, నిర్మాణాలు చేపట్టేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని ఆసామి చెబుతున్నారు. అయితే రెవెన్యూ అధికారులు ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగానే ధ్రువీకరించారని, తప్పుడు సర్వేనెంబర్లతో డాక్యుమెంట్లు సృష్టించి న్యాయస్థానాన్ని మభ్యపెడుతున్నారని, దీనిపై న్యాయపరంగా కూడా ఎదుర్కొంటామని ఎంపీడీవో మధుసూదనరావు, ఈవోఆర్‌డీ రామకృష్ణరావు తెలిపారు.